Netflix | న్యూఢిల్లీ: ఇంటిపాల్లిదికి వినోదాన్ని పంచే నెట్ఫ్లిక్స్ చిక్కుల్లో పడింది. జాతి వివక్ష, వీసా ఉల్లంఘనకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యూఎస్ స్ట్రీమింగ్ దిగ్గజంపై భారత ప్రభుత్వం దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది. ఆ సంస్థ ఇండియా బిజినెస్, లీగల్ అఫైర్స్ మాజీ డైరెక్టర్ నందినీ మెహతాకు 20 జూలై 2020లో పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్న ఈ విషయం తాజాగా వెలుగు చూసింది.
భారత్లో నెట్ఫ్లిక్స్ తన కార్యకలాపాల నిర్వహణలో ప్రవర్తనా నియమావళితోపాటు వీసా నిబంధనల ఉల్లంఘన, చట్ట విరుద్ధ నిర్మాణాలు, జాతి వివక్ష వంటి చర్యలకు పాల్పడినట్టు హోం శాఖలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్వో)కు చెందిన భారత అధికారి దీపక్ యాదవ్ లేఖ రాశారు. మరోవైపు, నెట్ఫ్లిక్స్ తనను అన్యాయంగా తొలగించిందంటూ నందినీ మెహతా ఆరోపించారు. ఇందుకు సంబంధించి నెట్ఫ్లిక్స్పై అమెరికా కోర్టులో పోరాటడనున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వ దర్యాప్తును స్వాగతిస్తున్నట్టు చెప్పిన మెహతా.. ఆ నివేదికను బయట పెట్టాలని కోరారు. కాగా, నెట్ఫ్లిక్స్ మాత్రం జాతి, లింగ వివక్ష ఆరోపణలను తోసిపుచ్చింది. భారత ప్రభుత్వ దర్యాప్తు గురించి తమకు తెలియదని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.