చెన్నై, మార్చి 11: కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ఒక ‘విధ్వంసక నాగ్పూర్ ప్రణాళిక’ అని, కేంద్రం దానికి 10 వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా దాని అమలుకు తమ రాష్ట్రం అంగీకరించదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పునరుద్ఘాటించారు. మంగళవారం చెంగల్పట్టులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిందీ, సంస్కృత భాషలను అనుమతిస్తే తమిళనాడుకు రూ.2,000 కోట్లను ఇస్తామంటూ అహంకారపూరితంగా సోమవారం పార్లమెంట్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారన్నారు. జాతీయ విద్యావిధానం ప్రవేశపెడితే అది రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని ఆయన చెప్పారు.