NEET-UG 2024 exam : దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ యూజీ 2024 (NEET UG 2024) లో అక్రమాలపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమేనని అర్థమైందని కోర్టు పేర్కొంది. అయితే, ఇది 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం కాబట్టి ‘నీట్ రీటెస్ట్’ విషయాన్ని తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని తెలిపింది.
నీట్ యూపీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకైందని, పరీక్షలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, కాబట్టి ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నీట్ పేపర్ లీకైందనే విషయం స్పష్టమైందని, పరీక్ష పవిత్రతను దెబ్బతీసినట్లు రుజువైనా, నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా రీ టెస్టుకు ఆదేశిస్తామని తెలిపింది.
లీకైన నీట్ పేపర్ ఎంతమందికి చేరిందో.. ఎలా చేరిందో గుర్తించారా..? అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘లీకేజీతో లబ్ధిపొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు..? ఎంతమంది విద్యార్థుల ఫలితాలను హోల్డ్‌లో ఉంచారు..? వీటన్నింటిపై మాకు సమాధానాలు కావాలి.’ అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. నీట్ ప్రశ్నపత్రం తొలిసారి ఎప్పుడు లీకైందనే విషయాన్ని వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని, నీట్‌పై దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందో వెల్లడించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు జూలై 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అఫిడవిట్లు దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ, సీబీఐలకు ఆదేశాలు జారీచేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.