న్యూఢిల్లీ, జూన్ 25: నీట్ పేపర్ లీక్ కేవలం ఒక ప్రాంతానికి, ఐదారుగురు విద్యార్థులకు పరిమితమైనది కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల మంది విద్యార్థులకు పరీక్షకు ముందే పేపర్‌ను లీక్ చేసి వందల కోట్లు అర్జించాలని పేపర్ లీక్ చేసిన ముఠా లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ‘ఇండియా టుడే’ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బిజేందర్ గుప్తా అనే వ్యక్తి సంచలన విషయాలు బయటపెట్టాడు. బిజేందర్ 24 ఏండ్లుగా పేపర్ లీక్ మాఫియాలో ఒకడిగా ఉన్నాడు.
వివిధ రాష్ర్టాల్లో పేపర్ లీక్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. నీట్ పేపర్ లీక్ అవుతుందని, 700 మంది విద్యార్థులకు పరీక్షకు ముందే పేపర్ ఇచ్చి రూ.200-300 కోట్ల సంపాదించాలని కొందరు లక్ష్యంగా పెట్టుకున్నారని బిజేందర్ గుప్తా మార్చిలోనే చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్టింగ్ ఆపరేషన్‌లో బిజేందర్ గుప్తా పేపర్ లీక్‌కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించాడు. పేపర్ లీక్ చేయడానికి అనేక పద్ధతులు పాటిస్తామని, పరీక్ష కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను తరలించే బాక్సులను రవాణా సమయంలోనే పగలగొట్టి పేపర్లను ఎక్కువగా లీక్ చేస్తుంటామని బిజేందర్ చెప్పాడు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి కూడా పేపర్ లీక్ చేస్తామని, ప్రభుత్వంలో పైస్థాయి వ్యక్తుల ద్వారా కూడా చేస్తామని తెలిపాడు.
ఏదైనా తప్పు చేసి బ్లాక్‌లిస్టులోకి చేరిన సంస్థలు మళ్లీ కాంట్రాక్టులు పొందుతున్నాయని, తద్వారా పేపర్ లీకేజీలు జరుగుతున్నట్టు బయటపెట్టాడు. నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పాత్రధారిగా ఉన్న సంజీవ్ ముఖియా గురించి కూడా బిజేందర్ గుప్తా పలు విషయాలు వెల్లడించాడు. సంజీవ్ మొదట బ్లూటూత్ ద్వారా పరీక్ష రాసే విద్యార్థులకు సమాధానాలు చెప్పేవాడని, ఇప్పుడు అతడు రూ.20 – 30 కోట్ల మేర అప్పుల్లో ఉన్నాడని చెప్పాడు. అతడి కొడుకు శివ్ బీహార్‌లో ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో జైలులో ఉన్నాడని తెలిపాడు.
‘జైలుకు వెళ్లడం, బెయిల్ తెచ్చుకోవడం, మళ్లీ ఆట మొదలు పెట్టడం జరుగుతూనే ఉంటుంది. ఎంతకాలం జైలులో పెట్టగలరు?’ అంటూ అతడు బిజేందర్ ప్రశ్నించాడు. సంజీవ్ ముఖియా పోలీసులకు దొరకడని ధీమాగా చెప్పాడు. కాగా, 700 మంది విద్యార్థులకు నీట్ పేపర్ ఎలా వెళ్లిందని అడగగా.. ఢిల్లీ, పట్నాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 300 మంది విద్యార్థులు ఉంటారని తెలిపాడు. మూడు నాలుగు ప్రాంతాలకు బృందాలను పంపారని, అక్కడి నుంచి పేపర్ లీక్ అయ్యిందని చెప్పాడు.