NEET 2026 : దేశంలోని మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ 2026 పరీక్ష ఆదివారం మే 3న జరగనుంది. దేశంలోనే అత్యంత క్లిష్టమైన ప్రవేశ పరీక్షగా నీట్‌కు గుర్తింపు ఉంది. అందుకే ఈ పరీక్షను కఠినతరమైన రూల్స్ మధ్య కేంద్రం నిర్వహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే దశలో పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోపే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలి.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొన్ని రూల్స్ పాటించాల్సిందే. అవి.. పురుష విద్యార్థులు క్యాజువల్ ట్రౌజర్లు, ప్యాంట్లు, జీన్స్ మాత్రమే ధరించాలి. బూట్లు ధరించకూడదు. చెప్పులు మాత్రమే తొడుక్కోవాలి. టోపీలు, మఫ్లర్లు, తలను, ముఖాన్ని చుట్టి ఉంచే ఏ తరహా వస్త్రాన్ని ధరించకూడదు. విద్యార్థినులు లెగ్గింగ్స్, ట్రౌజర్లు మాత్రమే ధరించాలి. అలాగే, సింపుల్‌గా ఉండే చెప్పులు, శాండల్స్ మాత్రమే తొడుక్కోవాలి. షూస్ ధరించకూడదు. చేతికి మెహింది పెట్టుకోకూడదు. హ్యాండ్ బ్యాగులు, పర్సులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అందరు విద్యార్థినీ, విద్యార్థులు హాల్ టిక్కెట్ లేదా నీట్ అడ్మిట్ కార్డు తీసుకురావాలి. ప్రభుత్వం అనుమతించిన గుర్తింపు కార్డు కూడా తీసుకురావాలి.
అది కూడా ఫొటో ఉండే పాన్ కార్డు, ఆధార్ కార్డు, వోటర్ ఐడీ వంటివి మాత్రమే. పరీక్షా సమయానికి కనీసం ఒక గంట ముందు విద్యార్థులు హాజరుకావాలి. లేదా అరగంట ముందు లోపు పరీక్షా కేంద్రానికి వచ్చి ఉండాలి. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లో నిషేధిత వస్తువులైన మొబైల్ ఫోన్స్, బ్లూ టూత్ డివైజెస్, పేజర్లు, స్మార్ట్ వాచీలు, ఇయర్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్స్‌ను అనుమతించరు. ఒకవేళ వీటిని తీసుకొస్తే వాటిని స్టోర్ చేసుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. విద్యార్థులు తమ సొంత రిస్క్ మీద బయట ఎక్కడైనా వాటిని స్టోర్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు నీట్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.