న్యూఢిల్లీ: హిమాలయ గ్లేసియర్లలో ఉంటున్న సుమారు 1700 ప్రాచీన వైరస్(Ancient Viruses) జాతుల ఆనవాళ్లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. టిబెట్ పీఠభూమిలో ఉన్న గులియా మంచి పర్వతాల్లో ఆ వైరస్లు ఉన్నట్లు పసికట్టారు. వీటిల్లో కొన్ని వైరస్లు సుమారు 40 వేల ఏళ్ల క్రితం నాటివిగా ఉన్నట్లు భావిస్తున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జీ పింగ్ జాంగ్ నేతృత్వంలో ఆ వైరస్లపై అధ్యయనం జరిగింది. అయితే శతాబ్ధాలుగా వాతావరణ పరిస్థితులు మారుతుంటే, ఆ వాతావరణానికి తగినట్లు ఎలా ఆ వైరస్లు తట్టుకున్నాయో రిపోర్టులో తెలిపారు. నేచర్ జియోసైన్స్ జర్నల్లో ఆ నివేదికను ప్రచురించారు.
ఐస్ కోర్లను డ్రిల్ చేసి తీసిన శ్యాంపిళ్లను శాస్త్రవేత్తలను పరీక్షించారు. వేల సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మంచుగడ్డల్లోని పొరలను అధ్యయనంచేశారు. ప్రతి పొరలోనూ కీలకమైన పర్యావరణ సమాచారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వేలవేల సంవత్సరాల క్రితం నాటి సూక్ష్మజీవులు, వైరస్లు ఉన్నట్లు గుర్తించారు. గులియా గ్లేసియర్లోని సుమారు 310 మీటర్ల లోతైన ఐస్ కోర్ నుంచి మంచు శ్యాంపిల్ను సేకరించి స్టడీ చేశారు.
అడ్వాన్స్డ్ టెక్నిక్ల ద్వారా వైరస్లకు చెందిన డీఎన్ఏలను టెస్ట్ చేశారు. దీంతో సుమారు 1705 రకాల విభిన్న వైరస్ జాతులను గుర్తించారు. అయితే వాతావరణ పరిస్థితులను అనుసరించి ఆ వైరస్లలో జన్యు తేడాలు ఉన్నట్లు నిర్ధారించారు. హిమాలయ ప్రాంతానికి చెందిన కొన్ని వైరల్ కమ్యూనిటీలకు చెందిన వివరాలను కూడా వెల్లడించారు. సుమారు 11 వేల ఏళ్ల క్రితం యాక్టివ్గా ఉన్న వైరస్లను గుర్తించారు.
వైరస్ పనితీరుకు, వాతావరణ మార్పుకు బలమైన కనెక్షన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషించారు. క్లైమెట్ మారుతున్నా కొద్దీ.. కొత్త వైరస్లు పుట్టుకొచ్చినట్లు అంచనా వేశారు. ప్రకృతి పరిణామం వల్లే.. వైరల్ జనాభా పెరుగుతున్నట్లు స్టడీలో తెలిపారు.