ముంబై: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షోభం (NCP crisis) నెలకొన్నది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో తిరుగుబాటు చేసిన అజిత్ పవార్, ఆయన వర్గానికి చెందిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆ పార్టీ కోరింది. ఆదివారం డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్, మంత్రులుగా ప్రమాణం చేసిన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ క్రమశిక్షణ కమిటీ వారిపై చర్యలు చేపట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు వినతి పత్రం ఇచ్చింది. దీనిపై స్పందించిన స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ఆదివారం అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరైన ముగ్గురు ఎన్సీపీ నేతలను పార్టీ నుంచి తొలగించారు. ముంబై డివిజన్ ఎన్సీపీ అధ్యక్షుడు నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా అధ్యక్షుడు విజయ్ దేశ్‌ముఖ్‌తోపాటు శివాజీరావు గార్జేపై వేటు వేశారు. పార్టీలో తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ వర్గానికి ఈ మేరకు ఎన్సీపీ అల్టిమేటమ్ జారీ చేసింది. అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అన్ని జిల్లాల పార్టీ కార్యకర్తలు అండగా ఉన్నారని పేర్కొంటూ ఎన్నికల సంఘాన్ని కూడా ఆ పార్టీ ఆశ్రయించింది.