ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ వర్గానికి చెందిన ఎన్సీనీ ఎమ్మెల్యే (NCP MLA) కీలక వ్యాఖ్యలు చేశారు. తనకున్న బ్యాంకు సమస్యల కారణంగానే అజిత్ పవార్ వెంట ఉన్నట్లు తెలిపారు. అయితే శరద్ పవార్‌ను తాను ఎప్పుడూ గౌరవిస్తానని ఆయన అన్నారు. శనివారం వార్ధాలో జరిగిన కార్యక్రమంలో ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగ్నే పాల్గొన్నారు. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌తో కలిసి వేదికను పంచుకున్నారు.
కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగ్నే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. శరద్ పవార్‌ను తాను ఎప్పుడూ గౌరవిస్తానని ఆయన అన్నారు. ‘నా జిల్లా సహకార బ్యాంకు (బుల్దానాలో) ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిస్సహాయత కారణంగా నేను అజిత్ దాదా (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వం వైపు వెళ్లాల్సి వచ్చింది. ఈ రోజు ప్రభుత్వం నుంచి జిల్లా సహకార బ్యాంకు రూ. 300 కోట్లు పొందింది. కానీ పవార్ సాహెబ్ (శరద్ పవార్) నాకు ఎల్లప్పుడూ గౌరవనీయులు’ అని అన్నారు.
మరోవైపు ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ఎంవీఏ కూటమి విజయంతో ఎస్పీపీ నేతలు ఇప్పటికే శరద్ పవర్ శిబిరంలో చేరుతున్నారు. అజిత్ పవార్ వెంట ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు బహిరంగంగానే శరద్ పవార్‌కు మద్దతిస్తున్నారు.