ముంబై: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై (Devendra Fadnavis) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ మెదడులో నుంచి పుట్టిన ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న నాగ్‌పూర్-ముంబై సమృద్ధి మహామార్గ్ (Samruddhi Mahamarg) ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. ఆ రోడ్డు వాహనాల రాకపోకలకు ఏమాత్రం అనువుగా లేదన్నారు. హైవే ప్రారంభించి ఏడు నెలలే అవుతున్నప్పటికీ ప్రదాలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయని.. మృతులు దేవేంద్రవాసులు (Devendrawasis) అవుతున్నారని నిప్పులు చెరిగారు. ఒక సారి ఆ రోడ్డుపై ప్రయాణించి చూడాలన్నారు.
సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేలో (Samruddhi Expressway) నాగ్‌పూర్ (Nagpur) నుంచి పుణే (Pune) వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అది బోల్తాపడింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్‌పై శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతేడాది డిసెంబర్ 12న నాగ్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ఫడ్నవీస్ ప్రారంభించారు.
కాగా, ఎక్స్‌ప్రెస్‌వేను పూర్తి అశాస్త్రీయంగా నిర్మించారని, దీంతో ఆ రోడ్డుపై లెక్కకు మించిన ప్రమాదాలు జరుగుతున్నాయని పవార్ అన్నారు. తానుకూడా ఒకసారి ఆ రూట్లో ప్రయాణించానని చెప్పారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదాల్లో మరణించినవారు దేవేంద్రవాసీ అవుతున్నారని ప్రజలు అంటున్నారని వెల్లడించారు. బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కాదని, ప్రమాదాల నివారణకు మార్గం చూపించాలని డిమాండ్ చేశారు. నిపుణులతో కూడిన కమిటీని వెయాలన్నారు. ఆ మార్గంలో ఎలాంటి సూచికలు లేవనే ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు.