కొత్తగూడెం ప్రగతి మైదాన్, సెప్టెంబర్ 27 : యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు నక్సలైట్ల ఆయుధ తయారీ కర్మాగారాన్ని ధ్వంసం చేసిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దండకారణ్యంలో శనివారం జరిగింది. మెట్టుగూడ క్యాంప్ సమీపంలో జిల్లా పోలీస్ బలగాలు, కోబ్రా-203వ బెటాలియన్, సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
ఈ క్రమంలో మావోయిస్టుల ఆయుధ తయారీ కర్మాగారాన్ని గుర్తించిన భద్రతా దళాలు.. ఆయుధ, వస్తు సామగ్రిని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రెండు బ్యారల్ గ్రనేడ్ లాంచర్ (బీజీఎల్)లు, 12 ఖాళీ బీజీఎల్ షెల్స్, 94 బీజీఎల్ హెడ్స్, ఒక చేతి గ్రైండర్ మిషన్, ఆరు చెక్క రైఫిల్ బట్స్, ఒక ట్రిగ్గర్ మెకానిజమ్తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న అనంతరం జవాన్లు ఆ కర్మాగారాన్ని ధ్వంసం చేశారు.