న్యూఢిల్లీ, జూన్ 26: పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణపై ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నౌకాదళానికి, ఇతర రక్షణ విభాగాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని డబ్బు కోసం ఐఎస్ఐకి చెందిన ఓ పాక్ మహిళకు నౌకాదళం ప్రధాన కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న విశాల్ యాదవ్ అందచేశాడు.
పాకిస్థానీ నిఘా సంస్థకు చెందిన ఓ మహిళ ప్రియా శర్మ పేరుతో పరిచయం పెంచుకుని రక్షణ దళానికి చెందిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఆన్లైన్ గేమ్‌కు బానిసైన విశాల్‌కి డబ్బు ముట్టచెబుతున్నదని పోలీసులు తెలిపారు.