చండీఘఢ్ : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. కెప్టెన్ సింగ్‌ను ప్రతికూల శక్తిగా సిద్ధూ అభివర్ణించారు. పంజాబ్‌లో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని కెప్టెన్ సింగ్ ప్రకటిస్తూ సిద్ధూపై విమర్శలు చేయడంతో మాజీ క్రికెటర్ స్పందించారు. పెద్ద మాటలు మాట్లాడుతున్న సిద్ధూకు మెదడు లేదని సింగ్ దుయ్యబట్టారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ ఎక్కడ పోటీ చేసినా ఆయనపై పోరాడతామని స్పష్టం చేశారు. ఇక కెప్టెన్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించిన సిద్ధూ ఈడీని ఉసిగొల్పడంతో అమరీందర్ బీజేపీ పంచన చేరారని ఆరోపించారు. తన ప్రయోజనాల కోసం పంజాబ్ ప్రయోజనాలను అమరీందర్ తాకట్టు పెట్టారని సిద్ధూ ధ్వజమెత్తారు. గతంలో అమరీందర్ పార్టీని ఏర్పాటు చేస్తే కేవలం 856 ఓట్లు ఆయన రాబట్టారని ఎద్దేవా చేశారు. పంజాబ్ ప్రయోజనాలతో రాజీపడిన అమరీందర్ సింగ్‌కు మరోసారి బుద్ధిచెప్పేందుకు పంజాబ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిద్ధూ వ్యాఖ్యానించారు.