చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్రూరమైన వ్యక్తి అని ఆయన సోదరి సుమన్ తుర్ ఆరోపించారు. డబ్బు కోసం తల్లిని కూడా వదిలేశాడని ఆమె విమర్శించారు. అమెరికాలో నివాసం ఉంటున్న సిద్ధూ పెద్ద అక్క సుమన్ తుర్, ప్రస్తుతం చండీగఢ్‌లో ఉంటున్నారు. శుక్రవారం ఆమె మీడియతో మాట్లాడారు. 1986లో తమ తండ్రి చనిపోయిన తర్వాత, సిద్ధూ తనను, తమ తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆమె ఆరోపించారు. తమ తల్లి 1989లో రైల్వే స్టేషన్లో మరణించిందని చెప్పారు. ఆస్తి కోసమే సిద్ధూ తమతో సంబంధాలు తెంచుకున్నారని ఆమె ఆరోపించారు.
తమ తండ్రి మరణించిన తర్వాత పింఛనుతో పాటు ఇల్లు, భూమితో సహా అన్ని ఆస్తులు తమకు ఉన్నాయని సుమన్ తుర్ తెలిపారు. అయితే డబ్బు కోసం తమ అమ్మను సిద్ధూ విడిచిపెట్టాడని ఆమె ఆరోపించారు. సిద్ధూ నుంచి తమకు ఎలాంటి డబ్బు అక్కర్లేదని అన్నారు. “మేము చాలా కఠినమైన కష్టాలను ఎదుర్కొన్నాం. నా తల్లి నాలుగు నెలలు ఆసుపత్రిలో ఉంది. నేను చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతోసహా అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి” అని ఆమె అన్నారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ “క్రూరమైన వ్యక్తి” అని అక్క సుమన్ తుర్ ఆరోపించారు. తమ తల్లిదండ్రులు కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లుగా 1987లో ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ అబద్ధం చెప్పాడని విమర్శించారు. “మా తల్లిదండ్రుల గురించి సిద్ధూ చెప్పేదంతా అబద్ధం” అని తుర్ అన్నారు. దీని గురించిన ఆధారాలను సిద్ధూ చూపాలని ఆమె డిమాండ్ చేశారు. తమ తల్లిదండ్రులు విడిపోయినట్లుగా సిద్ధూ చేసిన ఆరోపణలపై తమ తల్లి కోర్టును కూడా ఆశ్రయించారని అన్నారు.
కాగా, ఈ నెల 20న సిద్ధూను కలిసేందుకు తాను ఆయన ఇంటికి వెళ్లానని, అయితే తనను కలిసేందుకు నిరాకరించడంతోపాటు కనీసం తలుపు కూడా తీయలేదని సోదరి సుమన్ తుర్ ఆరోపించారు. తన మొబైల్ నంబర్‌ను కూడా బ్లాక్ చేశాడని ఆమె తెలిపారు. సిద్ధూను సంప్రదించేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. తన తల్లికి న్యాయం జరుగాలని ఆమె డిమాండ్ చేశారు. 70 ఏండ్ల వయసులో ఇలా తన కుటుంబ విషయాలను బయటకు చెప్పుకోవడం చాలా బాధగా ఉందన్నారు.
మరోవైపు పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగనున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన సిద్ధూ, ఆ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే సీఎం కావచ్చని ఆశగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో అక్క సుమన్ తుర్, మీడియా ఎదుట సిద్ధూపై పలు ఆరోపణలు చేయడం ప్రాథాన్యం సంతరించుకున్నది.