భువనేశ్వర్: పేపర్ చూడకుండా ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలని సవాల్ చేసిన ప్రధాని మోదీకి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) వీడియో ద్వారా ఆదివారం కౌంటర్ ఇచ్చారు. ఒడిశా గురించి మీకెంత తెలుసు? అని ప్రశ్నించారు. ఒడియా శాస్త్రీయ భాష అయినప్పటికీ, మీరు దాని గురించి మరిచిపోయారని విమర్శించారు. ‘సంస్కృతానికి వెయ్యి కోట్లు కేటాయించారు, కానీ ఒడియాకు సున్నా’ అని ఎద్దేవా చేశారు. అలాగే ఒడిస్సీ సంగీతాన్ని కూడా ప్రధాని మర్చిపోయారని నవీన్ పట్నాయక్ అన్నారు. ‘క్లాసికల్ ఒడిస్సీ సంగీతం గుర్తింపు కోసం నేను ప్రతిపాదనలు పంపాను. మీరు వాటిని రెండుసార్లు తిరస్కరించారు’ అని ఆరోపించారు.
కాగా, అన్ని వనరులు ఉన్నప్పటికీ ఒడిశా ఎందుకు రిచ్‌గా లేదు? ప్రజలు ఎందుకు పేదలుగా ఉన్నారు? దీనికి బాధ్యులెవరు? అని ప్రశ్నించిన ప్రధాని మోదీకి నవీన్ పట్నాయక్ బదులిచ్చారు. ఒడిశా సహజ సంపద బొగ్గు అని తెలిపారు. ఒడిశా నుంచి బొగ్గు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా దానిపై రాయల్టీ పెంచడం మరిచిపోయిందని ఆరోపించారు.
మరోవైపు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఒడిశాను గుర్తుపెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ మోదీకి నవీన్ పట్నాయక్ కౌంటర్ ఇచ్చారు. ఒడిశా రాష్ట్రానికి 2014, 2019లో ప్రధాని చేసిన వాగ్దానాలను గుర్తు చేశారు. ‘2 కోట్ల ఉద్యోగాలు, ఎల్పీజీ, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గింపు, అందరికీ మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తామన్న మీ వాగ్దానాన్ని ఒడిశా ప్రజలు గుర్తించుకున్నారు. జీఎస్టీని తగ్గించండి లేదా వదులుకోండి’ అని అన్నారు.
కాగా, పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు భారత రత్న ఇవ్వగా, ‘ఒడిశా వీర కుమారులను గౌరవించడం’ మోదీ ప్రభుత్వం ఎందుకు మరిచిపోయిందని నవీన్ పట్నాయక్ ప్రశ్నించారు. ‘జూన్ 10న కాదు కదా మరో పదేళ్లలో ఏమీ జరుగదు. ఒడిశా ప్రజల హృదయాలను బీజేపీ గెలుచుకోలేదు’ అని అన్నారు. ఒడిశాలో బీజేడీ ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Forget about June 10, BJP will not be able to win hearts of people in next 10 years, said Hon'ble CM @Naveen_Odisha.
With the blessings of Mahaprabhu Jagannath and 4.5 crore people of Odisha, HCM Naveen Patnaik will be sworn-in as the Chief Minister of Odisha for a record sixth… pic.twitter.com/3mgL6XLBHB
— Manas Mangaraj (@manasrmangaraj) May 12, 2024