భువనేశ్వర్, జూన్ 5: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూసిన నవీన్ పట్నాయక్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ రఘుబర్ దాస్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అక్కడికి వచ్చిన జర్నలిస్టులకు చేయి ఊపి వెళ్లిపోయారు. 2000, మార్చి 5న తొలిసారి సీఎంగా ప్రమాణం చేసిన పట్నాయక్.. 24 ఏండ్ల పాటు ఒడిశా సీఎంగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, తొలిసారి ఆ రాష్ట్ర గడ్డపై అధికారాన్ని చేపట్టబోతున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ తొలి ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అన్న ఉత్కంఠ కలుగుతున్నది.కేంద్ర మాజీ మంత్రి జౌల్ ఓరమ్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని సీఎం పీఠం వరిస్తుంది? లేక కొత్త వారికి అవకాశం దక్కుతుందా? అన్నది తేలాల్సి ఉన్నది.