శాస్త్రీయ నృత్యంలో తనదైన ముద్రవేసి అభిమానుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి (84) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధ పడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
న్యూఢిల్లీ/ హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): శాస్త్రీయ నృత్యంలో తనదైన ముద్రవేసి అభిమానుల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి (84) శనివారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధ పడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1940 డిసెంబర్ 20న ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆమె జన్మించారు. బాల్యమంతా తమిళనాడులో సాగింది. 1956లో నృత్య ఆరంగేట్రం చేశారు. భరతనాట్యం, కూచిపూడితో పాటు ఒడిస్సీ సైతం నేర్చుకున్నారు. కర్ణాటక గాత్ర సంగీతం, వీణ వాయించడంలోనూ ఆమె దిట్ట.
ఆమె ప్రధానంగా భరతనాట్యం, కూచిపూడిపై దృష్టి సారించి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. నృత్యంలో ప్రపంచవ్యాప్తంగా భారత దేశ కీర్తిని వ్యాపింప చేశారు. మోహినీగా, సత్యభామగా, ఉషగా, శశిరేఖగా ఆమె అనేక నృత్యరూపకాల్లో పలు పాత్రలతో ఆకట్టుకున్నారు. యామిని కృష్ణమూర్తిని 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఆమె టీటీడీ ఆస్థాన నర్తకిగా సేవలందించారు. ‘ ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్’ పుస్తకం రచించారు. 1990లో ఢిల్లీలో యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ సంస్థను స్థాపించారు. యామినీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.