National weather : మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ కేంద్రం (IMD) చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాల (South West Monsoon) కు వాతావరణం అనుకూలంగా ఉందని, మరో రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ (Andaman) ను తాకవచ్చని తెలిపింది. తుపాను వలయం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని, రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొన్నది.
ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల అకాల వర్షాలు పడుతున్నప్పటికీ కాసేపటికి లేదా మరుసటి రోజు ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రానున్నయని వాతావరణ కేంద్రం తెలిపింది. మే 16 నాటికి నైరుతి రుతు పవనాలు అండమాన్ నికోబార్ చేరుకోవచ్చని అంచనా వేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. మే 13 నుంచి 19 వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.