ఊటీ: తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఇటీవల పులుల మృతి(Tiger Deaths) ఆందోళనకరంగా మారింది. ఆ జిల్లాలో గడిచిన 40 రోజుల్లో సుమారు 10 పులులు మృతిచెందాయి. దాంట్లో ఆరు పులి పిల్లలు కూడా ఉన్నాయి. అయితే పులుల మృతి ఘటనలను దర్యాప్తు చేపట్టేందుకు జాతీయ టైగర్ కమీషన్‌కు చెందిన బృందం నీలగిరికి చేరుకున్నది. పులుల మృతిపై ఆ బృందం విచారణ మొదలుపెట్టింది. ఊటీలో ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆ బృందం సోమవారం విజిట్ చేసింది.
నేషనల్ టైగర్ కమిషన్ క్రైం బ్రాంచ్ బృందంలో ఇన్స్పెక్టర్ జనరల్ మురళీకుమార్, సెంట్రల్ ఫారెస్ట్ యానిమల్ క్రైమ్ ప్రివెన్షన్ యూనిట్ సౌత్ జోన్ డైరెక్టర్ కృపా శంకర్, సెంట్రల్ ఫారెస్ట్ యానిమల్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ సైంటిస్ట్ రమేశ్ కృష్ణ మూర్తి ఉన్నారు. పులుల మృతి వివాదాస్పదం కావడంతో.. మదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేశారు. పులి కూనలకు చెందిన తల్లిపులుల ఆచూకీని ఇంత వరకు అధికారులు పసికట్టలేదు.
కూనల్ని విడిచిపెట్టి తల్లి పులి 200 మీటర్ల దూరం దాటి వెళ్లదని, అయితే తల్లి పులుల్ని చంపి ఉంటారన్న కోణంలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఊటీ తర్వాత చిన్న కూనూరు ప్రాంతంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. కూనూరులో ఇటీవల నాలుగు పులి పిల్లలు మృతిచెందాయి.