ముంబై/బెంగళూరు, ఏప్రిల్ 28: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మధ్య హిందీ భాషపై రేగిన వివాదం తీవ్ర చర్చకు దారితీస్తున్నది. జాతీయ భాష అంశంపై వీరిద్దరి మధ్య జరిగిన చర్చపై పలువురు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు. ఆయన చెప్పిందే కరెక్టేనని సమర్థిస్తున్నారు. బీజేపీ హిందీ జాతీయ వాదానికి అనుగుణంగా దేవగణ్ మాట్లాడారనే విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా భారతదేశం వంటి వైవిధ్య దేశానికి జాతీయ భాష అంటూ ఉండదని పలువురు స్పష్టీకరిస్తున్నారు. బీజేపీ పాలిత కర్ణాటక సీఎం బొమ్మై కూడా సుదీప్ చెప్పింది కరెక్టేనని మద్దతు పలికారు. ఇదే సమయంలో ‘HindiIsNotNationalLanguage’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అయింది.
అసలేం జరిగింది?
నటుడు కిచ్చా సుదీప్ ఇటీవల తన మూవీకి సంబంధించిన ఓ ఫంక్షన్లో మాట్లాడుతూ ఇకపై హిందీ జాతీయ భాష కాదని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ సినిమాల కంటే కేజీఎఫ్-2, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి దక్షిణాది సినిమాలే దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధిక వసూళ్లు రాబడుతూ రికార్డులు సృష్టిస్తుండటాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సుదీప్ వ్యాఖ్యలపై అజయ్ దేవగణ్ బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిందీ జాతీయ భాష కానప్పుడు, మీ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీ జాతీయ భాషగా ఎప్పటికీ ఉంటుందని అని పేర్కొన్నారు. దేవగణ్ ట్వీట్‌కు సుదీప్ స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వ్యక్తిగతంగా కలిసినప్పుడు అన్నీ చెబుతానని అన్నారు. హిందీ భాషను హిందీయేతర రాష్ర్టాలపై బలవం తంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదనే తీవ్ర విమర్శలు ఇప్పటికే ఉన్న విషయం తెలిసిందే.
వివాదంపై ఎవరేం అన్నారు!
జాతీయ భాష ఎప్పటికీ కాదు
‘హిందీ ఎప్పటికీ జాతీయ భాష కాదు. మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని గుర్తించడం అందరి కర్తవ్యం. ప్రతిభాషకు గర్వించదగిన చరిత్ర ఉంటు ంది. కన్నడిగుడిని అయినందుకు గర్విస్తున్నా’
-సిద్ధరామయ్య,కాంగ్రెస్ నేత, మాజీ సీఎం
బాలీవుడ్ నటుల్లో అభద్రత, అసూయ
‘దక్షిణాది సినిమాల భారీ విజయాల పట్ల బాలీవుడ్ నటులు అభద్రత, అసూయతో ఉన్నారు. కన్నడ డబ్బింగ్ మూవీ కేజీఎఫ్-2 ఓపెనింగ్ రోజున రూ.50 కోట్లు రాబట్టింది. రాబోవు హిందీ చిత్రాల ఓపెనింగ్స్‌ను మనం చూస్తాం..’
-రామ్‌గోపాల్ వర్మ, డైరెక్టర్
సుదీప్ మాటలు కరెక్టే
‘భాషా ప్రాతిపదికన రాష్ర్టాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో ప్రాంతీయ భాషలు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. సుదీప్ మాటలు సరైనవే.. అందరూ అర్థం చేసుకొని గౌరవించాలి’
– కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
హిందీ మన జాతీయ భాష
‘హిందీ మన జాతీయ భాష. కొన్ని ప్రాంతాల్లో ఇది మాతృభాషగా కూడా ఉన్నది. దీనికి మద్దతు పలికి ముందుకు తీసుకెళ్తాం. ఇదే సమయంలో మా ప్రభుత్వం అన్ని ప్రాంతీయ భాషలను గౌరవిం చడంతో పాటు ప్రోత్సహిస్తుంది’
– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి