న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) ముందు హాజరుకానున్నారు. రెండోవిడత విచారణలో భాగంగా మంగళవారం ఆరు గంటలపాటు సోనియాను అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే నేడు మరోసారి విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంలో ఈ నెల 21న తొలిసారి సోనియాను ఈడీ ప్రశ్నించింది.
కాగా, రెండు రోజుల్లో 9 గంటలపాటు మొత్తం 55 ప్రశ్నలు అడిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఈడీ కార్యాలయంతోపాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.