న్యూఢిల్లీ, మే 22: సమగ్ర శిక్షా పథకం కింద 2024-25 సంవత్సరానికి సంబంధించిన రూ.2,151 కోట్ల కేంద్ర విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రానికి, ఒకటి లేదా ఎక్కువ రాష్ర్టాల మధ్య వివాదాలను విచారించే ప్రత్యేక పరిధిని సుప్రీంకోర్టుకు కల్పించే రాజ్యాంగంలోని 131వ అధికరణ కింద తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖపై పిటిషన్ దాఖలు చేసింది.
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020ని, దానికి అనుబంధమైన పీఎం శ్రీ పాఠశాలల పథకాన్ని బలవంతంగా అమలు చేయడానికి కేంద్రం చేసిన ప్రయత్నాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామని, ముఖ్యంగా వివాదాస్పద త్రిభాషా సూత్రానికి తాము వ్యతిరేకమని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. తమిళనాడులో ఈ పథకాలను అమలు చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య లాంఛనంగా ఒప్పందం జరిగేంత వరకు ఈ రెండు పథకాలు తమ రాష్ట్రంలో అమలు చేయడం తప్పనిసరి కాదని కేంద్రాన్ని ఆదేశించాలని డీఎంకే ప్రభుత్వం పిటిషన్లో అర్థించింది.