e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home News బూస్టర్‌ డోస్‌, పిల్లల టీకాపై తేలేనా?.. రేపు సాంకేతిక నిపుణుల కమిటీ సమావేశం

బూస్టర్‌ డోస్‌, పిల్లల టీకాపై తేలేనా?.. రేపు సాంకేతిక నిపుణుల కమిటీ సమావేశం

న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. భారత్‌లో ఇప్పటి వరకు 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ను అడ్డుకునేందుకు టీకానే ఏకైక ఆయుధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత్‌లో టీకాల పంపిణీ ప్రారంభమై పది నెలలు దాటిపోతున్నది. ఈ క్రమంలో బూస్టర్‌ డోస్‌పై చర్చ జరుగుతున్నది.

అలాగే పిల్లలకు సంబంధించిన టీకాలు అందుబాటులోకి వచ్చినా ఇంకా పంపిణీ ప్రారంభించలేదు. ఈ క్రమంలో ఇమ్యునైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహా సోమవారం (డిసెంబర్‌ 6న) సమావేశం కానున్నది. భేటీలో రోగనిరోధకశక్తి తక్కువ ఉన్న వ్యక్తులకు టీకాలు బూస్టర్‌ డోస్‌ (మూడో టీకా) ఇవ్వడంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను బూస్టర్‌ డోసుగా అందించేందుకు డీసీజీఐకి దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ యూకే మెడికల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరి ఏజెన్సీ సైతం (UK-MHRA) ఇప్పటికే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను బూస్టర్‌ డోస్‌గా ఆమోదించిందని తెలిపారు. గత నెల 29న ఇండియన్‌ సార్స్‌ కోవ్‌-2 కన్సార్టియం ఆన్‌ జెనోమిక్స్‌ (INSACOG) 40 ఏళ్లు దాటిన వ్యక్తులకు బూస్టర్‌ డోసు వేయాలని, హై రిస్ట్‌ ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలంటూ సిఫారసు చేసింది.

అయితే, శనివారం బూస్టర్‌ డోస్‌ ప్రభావాన్ని అంచనా వేసేందుకు అనేక శాస్త్రీయ ప్రయోగాలు అవసరమని, బూస్టర్ డోస్‌ల నిర్వహణకు సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టీఏజీఐ), కొవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ (ఎన్‌ఈజీవీఏసీ) శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా లోక్‌సభలో తెలిపిన విషయం తెలిసిందే.

సోమవారం జరుగనున్న సాంకేతిక కమిటీ భేటీలో బూస్టర్‌ డోస్‌పై చర్చించనున్నట్లు, ఈ అంశాన్ని సమావేశం అజెండాలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాన్సర్‌ రోగులు, ఎయిడ్స్‌ రోగులు, అవయవాల మార్పిడి చేసుకున్న వారికి మూడో డోస్‌ అవసరమని భావిస్తున్నారు. ఒమిక్రాన్‌ వంటి కొత్త ఉత్పరివర్తనాలు పుట్టుకువస్తున్న నేపథ్యంలో వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు మరింత రక్షణ అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు వేరియంట్‌కు వ్యతిరేకంగా పని చేయవనడానికి ఆధారాలు లేనప్పటికీ.. కొన్ని వేరియంట్లు టీకా సామర్థ్యాన్ని తగ్గించవచ్చని ఇటీవల కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే భేటీలో పిల్లలకు సంబంధించిన టీకాపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. గత ఆగస్ట్‌లో జైడస్‌ క్యాడిలా తయారు చేసిన జైకోవ్‌ డీ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

అలాగే భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు సైతం అత్యవసర వినియోగ అనుమతి ఇస్తూ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే, పిల్లలకు సంబంధించిన టీకాల విషయంలో తొందరపడేది లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement