అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ అథఃపాతాళానికి పడిపోవటంపై ప్రజలు తమదైన శైలిలో కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గొప్ప నాయకత్వం ఉంటేనే రూపాయి కూడా బలంగా ఉంటుందని 2013లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ చేసిన ప్రకటనను గుర్తుచేస్తూ బైబై మోదీ అని ట్వీట్లు చేస్తున్నారు. 2013లో పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న నరేంద్రమోదీ, రూపాయి పతనంపై వివిధ సందర్భాల్లో ఏమన్నారో ఓసారి చూద్దాం..
పోటీ పతనం
రూపాయి, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నది. ఆ పోటీ పతనం అవటంలో.. జూన్ 23, 2013
ఎవరిని కాపాడుతారు?
కాంగ్రెస్‌కు నా సూటి ప్రశ్న ఏంటంటే.. ప్రభుత్వాన్ని కాపాడాలా? పతనమవుతున్న రూపాయిని కాపాడాలా?
సెప్టెంబర్ 10, 2013l నాడు రూపాయి, డాలర్ సమానం మనకు స్వాతంత్య్రం వచ్చిన నాడు రూపాయి, డాలర్ విలువ సమానం. ఇప్పుడు చూడండి.. రూపాయి ఎలా పతనమవుతున్నదో..! జూన్ 14, 2013
కుర్చీ కోసమే ఆరాటం
కేంద్ర ప్రభుత్వానికి దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపైగానీ, రూపాయి పతనంపైగానీ పట్టింపు లేదు. కేవలం కుర్చీ కాపాడుకోవాలన్న ఆందోళన తప్ప.. ఆగస్టు 20, 2013
తీవ్ర నిర్లక్ష్యం
గత మూడు నెలలుగా డాలర్‌తో రూపాయి మారకం విలువ వేగంగా పడిపోతున్నది. దీనిని చక్కదిద్దటానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇతర దేశాలు భారత్‌ను తేలిగ్గా తీసుకొంటాయి. ఆగస్టు 20, 2013
కేంద్రానికి మార్గదర్శనమే లేదు
ఇంతటి ఆర్థిక సంక్షోభాన్ని చూస్తామని దేశప్రజలు ఏనాడూ ఊహించి ఉండరు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వానికి ఓ మార్గదర్శనం, భరోసా లేకుండా పోయాయి. ప్రజల్లో విశ్వాసం నింపేందుకు కేంద్రం ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. ఆగస్టు 20, 2013
ధరలు ఎక్కడ తగ్గాయి?
ధరలు తగ్గాయని, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నదని గత ఐదేండ్లలో ప్రతి మూడు నెలలకోసారి వింటూనే ఉన్నాం. కానీ ఏనాడూ అవి వాస్తవంలోకి రాలేదు. ఆగస్టు 20, 2013
అటల్జీ దిగిపోగానే పతనం
అటల్ జీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒక అమెరికా డాలర్‌కు 42 రూపాయిలు ఉండేది. ఆయన దిగిపోగానే డాలర్‌కు 44 రూపాయలు అయ్యింది. నెహ్రూ ప్రధానిగా ఉన్పప్పుడు మనం మొదటిసారి విదేశాల నుంచి లోన్ తీసుకొన్నాం. అప్పటి నుంచే రూపాయి పతనం ప్రారంభమైంది. జూలై 24, 2013
రెండింటికీ విలువ లేదు
ఇప్పుడు యూపీఏ ప్రభుత్వంతోపాటు మన రూపాయి కూడా విలువ కోల్పోయాయి. దేశం ధ్వం సం కాకుండా కాపాడుకోవాల్సిన సమయం వచ్చిం ది. ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తున్నది.
ఆగస్టు 24, 2013
మంచి నాయకత్వం ఉంటే..
డబ్బులు చెట్లకు కాయవు అని మన ప్రధానమంత్రి అంటున్నారు. కానీ సరైన నాయకత్వం ఉంటే డబ్బులు పంటపొలాల్లో, ఫ్యాక్టరీల్లో కాస్తాయి. జూలై 24, 2013
చప్పుడు బంద్
ఒకప్పుడు మన రూపాయి మస్తు చప్పుడు చేస్తుండేది.. నేడు దానికి గొంతు పోయింది. మన ప్రధాని లాగా.. ఇప్పుడు రూపాయి, ప్రధాని ఇద్దరూ మౌనమే. ఆగస్టు 24, 2013
పరిమాణం మాత్రమే తగ్గింది
రూపాయి శక్తి కోల్పోలేదు.. దాని పరిమాణం మాత్రమే తగ్గింది. ఎందుకంటే ఢిల్లీలో కూర్చుకొన్నవారు అవినీతితో ఉన్నారు కాబట్టి.. జూలై 14, 2013
రూపాయి విలువ ఆర్థిక మంత్రి వయసంత!
డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతున్నది. పోనుపోను ఇది మన ఆర్థిక మంత్రి వయసుకు సమానమయ్యేట్టున్నది. జూలై 14, 2013
ప్రధాని మోదీగారూ ఇప్పుడు ఏమంటారు?
రూపాయి విలువను తగ్గించారు
అటల్జీ ప్రధానిగా ఉన్నప్పుడు పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహిస్తే ప్రపంచమంతా మనపై ఆంక్షలు విధించింది. ఏ దేశమూ మనతో వ్యాపారం చేయలేదు. అంత కఠిన పరిస్థితిల్లోనూ డాలర్‌తో రూపాయి విలువ 40-45 మధ్యనే ఉన్నది. కానీ చిదంబరం జీ.. మీరు ఇప్పుడు రూపాయి విలువను 66 వరకు తీసుకెళ్లారు.
నవంబర్ 29, 2013
రూ.26కు ఏమొస్తది?
మన ప్రధాని గొప్ప ఆర్థికవేత్త. మహా మేధావి.. అయితే, రోజుకు రూ.26 కంటే ఎక్కువ ఖర్చుపెట్టేవారు ధనికులని ఆయన చెప్తున్నారు. రూ.26తో ఏమొస్తది? రెండు కప్పులు చాయ్ వస్తుందా? మిస్టర్ పీఎం రూ.26తో మీరు అరకిలో ఉల్లిగడ్డలు కూడా కొనలేరు. కానీ, రోజుకు రూ.26కంటే ఎక్కువ ఖర్చు చేసేవారు పేదవాళ్లు కాదని మీరంటున్నారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు ప్రజలకు ఏమీ చేయలేరు.
నవంబర్ 29, 2013