
ముంబై: వచ్చే మార్చిలోగా మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న కేంద్ర మంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలకు మంత్రి నవాబ్ మాలిక్ ఘటుగా బదులిచ్చారు. అంచనాలు, కలలు, ప్రార్థనలతో మీ కోరికలు తీరవని అన్నారు. ‘మొదట దేవేంద్ర ఫడ్నవిస్ ఎంవీఏ ప్రభుత్వ పతనాన్ని అంచనా వేశారు. ఆ తర్వాత చంద్రకాంత్ పాటిల్ ఆ బాధ్యత తీసుకున్నారు. వారి అంచనాలు ఏవీ నిజం కాలేదు. ఇప్పుడు నారాయణ్ రాణే ఆ పని చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
23 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణ్ రాణే, సీఎం పదవి కోసం కాంగ్రెస్లోకి వెళ్లారని ఆ తర్వాత బీజేపీలో చేరారని నవాబ్ మాలిక్ విమర్శించారు. ‘మరోసారి రాణే సీఎం కోరిక నెరవేరాలని ప్రార్థిస్తూ ఆయన అనుచరులు వేల మేకలు, కోళ్లను పెంచి ఉండాలి. అయితే అంచనాలు, కలలు, ప్రార్థనల ద్వారా ప్రభుత్వం ఏర్పడదు’ అని ఎద్దేవా చేశారు.
తమ మూడు పార్టీల పొత్తు, ప్రభుత్వం ఐదేండ్లు కాదు, 25 ఏండ్లు ఉంటుందని సీఎం ఉద్ధవ్ అన్న సంగతిని నవాబ్ మాలిక్ గుర్తు చేశారు. ప్రజలకు తమ ప్రభుత్వంపై నమ్మకం ఉన్నదని, తర్వాత ఎన్నికల్లో కూడా తమనే గెలిపిస్తారని, 25 ఏండ్ల అధికారాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.