Naravane : ఇటీవల పార్లమెంట్ (Parliament) వేదికగా తన పుస్తకంపై తీవ్ర చర్చ జరగడంపై భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె (Manoj Naravane) మౌనం వీడారు. నవరణె పుస్తకంపై అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద గొడవే జరిగినా ఇప్పటివరకు ఆయన స్పందించలేదు. నరవణె రాసిన‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ (Four Stars of Destiny)’ పుస్తకంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. తన పుస్తకం ఇంకా పబ్లిష్ కాకపోయినా అనవసరంగా తనను వివాదంలోకి లాగారని ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. పరోక్షంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై ఆయన విమర్శలు చేశారు.
నరవణె రాసిన మరో పుస్తకం ‘ద క్యూరియస్ అండ్ ద క్లాసిఫైడ్ అన్ఎర్త్ మిలిటరీ మైత్స్ అండ్ మిస్టరీస్’ ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలోనే ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. ‘ఈ మధ్య నా పుస్తకంపై జరిగిన వివాదం తర్వాత రెండు పుస్తకాలు రాశాను. వాటిల్లో ఒకటి విడుదలైంది. మరోటి త్వరలో రానుంది. ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీని పూర్తిగా పరిశీలించేవరకు ప్రచురణను నిలిపివేయమని రక్షణ మంత్రిత్వశాఖ కోరింది. ఆ విషయం అక్కడితో ముగిసింది. నేను ముందుకెళ్లాను. నా వరకు అది ముగిసిపోయిన అధ్యాయం. కానీ ప్రచురితం కాని పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చి కొందరు దానిపై తీవ్ర చర్చలు చేశారు. తద్వారా పుస్తకంతో పాటు నన్నూ వివాదంలోకి లాగినట్టే కదా. ఇది ఏమాత్రం సమంజసం కాదు’ అని నరవణె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చైనా దళాలతో భారత బలగాల ఘర్షణకు సంబంధించి వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తూ నరవణె రాసిన ఈ పుస్తకానికి రక్షణ మంత్రిత్వశాఖ నుంచి ప్రచురణ అనుమతి లభించలేదు. అయినప్పటికీ అప్పట్లో దీన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభకు తీసుకువెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.