హల్దియా: పశ్చిమ బెంగాల్లో ఉన్న నాఫ్తా పైప్‌లైన్(Naphtha Pipeline)లో పేలుడు ఘటన జరిగింది. పుర్బా మిద్నాపూర్ జిల్లాలోని హల్దియా పెట్రోకెమికల్స్ సంస్థకు చెందిన పైప్‌లైన్ అగ్నిప్రమాదానికి గురైనట్లు అదికారులు చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. హల్దియా మున్సిపాల్టీలోని 13వ వార్డులో ఉన్న కొన్ని ఇండ్లు ఆ మంటలకు ధ్వంసం అయ్యాయి. 12 ఫైరింజిన్లు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. ప్రమాద సమయంలో సమీపంలో ఉన్న కార్మికులకు కాలిన గాయాలు అయ్యాయి. విషమంగా ఉన్న వారిని కోల్‌కతా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మంటల్ని అదుపులోకి తెచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఫోమ్, ఫ్లై యాష్‌తో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు.
నాఫ్తా పైప్‌లైన్‌లో లీకేజీ జరగడం వల్ల పేలుడు ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటన పట్ల దర్యాప్తు మొదలుపెట్టినట్లు చెప్పారు. భీకర స్థాయిలో మంటలు రావడం వల్ల సమీపంలో ఉన్న రైల్వే పరికరాలు ధ్వంసం అయ్యాయి. దీంతో రైల్వే సేవలు స్తంభించాయి. ప్లాంట్ సమీపంలో కొందరు పైప్‌లైన్ నుంచి చోరీ చేస్తున్నట్లు తెలిసిందని, ఆ ప్రదేశంలో పేలుడు జరిగినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. పెట్రో కెమికల్ ఉత్పత్తులకు చెందిన వ్యర్థమే నాఫ్తా. హైడ్రోకార్బన్ మిశ్రమం అయిన నాఫ్తా చాలా సులువుగా అంటుకుంటుంది. అక్రమ రీతిలో నాఫ్తాను పైప్‌లైన్ నుంచి చోరీ చేయడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.