నాగ్‌పూర్: ఫోన్లో ఆడుకుంటూ ఓ కుర్రాడు పంప్ హౌస్‌లో (Pumb House) పడిపోయాడు. అతని స్నేహితులు చూస్తుండగానే నీళ్లలో మునిగి చనిపోయాడు. అర్ధరాత్రి వేళ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఆ కుర్రాడు అంతలోనే అనంతలోకాలకు చేరుకున్న ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్నది.
నాగ్‌పూర్‌కి చెందిన పుల్కిత్ రాజ్ షహ్దాద్పురి అనే 16 ఏండ్ల కుర్రాడు ఈ నెల 11న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. అనంతరం స్నేహితులతో కలిసి అర్ధరాత్రివేల చెరువు వద్దకు వెళ్లాడు. అంతా సరదగా కాలక్షేపం చేస్తుండగా.. పుల్కిత్ తన స్మార్ట్‌ఫోన్‌లో గేమ్ ఆడుతూ అక్కడున్న పంప్‌హౌస్‌లో పడిపోయాడు. గుర్తించిన స్నేహితులు అక్కడున్న సిబ్బందిని సమాచారం అందించారు. అయితే వారు అక్కడికి చేరుకునే లోపే పుల్కిత్ నీళ్లలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.