Minister humour | నాగాల్యాండ్ వాసుల శరీరం విభిన్నంగా ఉంటుంది. వారి కండ్లు చిన్నవిగా ఉండి చూస్తే మూసుకున్నట్లుగా కనిపిస్తాయి. నాగాల్యాండ్ మంత్రి ఒకరు తన కండ్లపై తానే హ్యూమర్ కామెంట్స్ చేసి నెటిజెన్ల హృదయాలను గెలుచుకున్నాడు. ఆయనే నాగాల్యాండ్ ఉన్నత విద్య, ట్రైబల్ అఫైర్స్ మంత్రి టెమ్జెన్ ఇన్మా అలాంగ్. ఈయన నాగాల్యాండ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు కూడా.
నాగాల్యాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్ పేరు నెటిజెన్లకు సుపరిచితమే. తన హ్యూమర్ కామెంట్లతో ట్విట్లు చేస్తూ నెటిజెన్ల హృదయాలను దోచుకుంటున్నారు. తాజాగా తన కండ్లపైనే జోకులు పేల్చారు. ‘తన కండ్లు చిన్నవే కావచ్చు.. కానీ మైలు దూరం వరకు కనిపెడ్తాయి..’ అంటూ ట్విట్టర్లో తన ఫొటోతో షేర్ చేశారు. అంతటితో ఆగకుండా ‘ మీరు ఈ పోస్ట్ చదువుతున్నప్పుడు నవ్వుతుండటం నేను చూడగలను’ అని కూడా రాసి మరింత ఆకట్టుకున్నాడు.
గతంలో తాను ఒంటరి వాడినని అంటూ వ్యాఖ్యలు చేసి నవ్వించిన ఇమ్నా అలాంగ్ .. ప్రస్తుతం తన కండ్లపై కామెంట్లు చేసుకుని మరింత పాపులర్ అయ్యాడు. ఆదివారం ఉదయం ట్విట్టర్లో షేర్ చేసిన ఫొటోను 52 వేల మంది వీక్షించారంటే ఆయనకు ట్విట్టర్లో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్దం చేసుకోవచ్చు. వేల మంది రిప్లై కామెంట్లు చేశారు. మీరు మమ్మల్ని నవ్విస్తుండటం సంతోషకరమని ఒక నెటిజెన్ వ్యాఖ్యానించాడంటే.. ఇమ్నా అలాంగ్ ట్వీట్లపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతున్నది.