లక్నో: తన భార్య గుట్కా (Gutkha) నమిలి, ఇల్లాంతా ఉమ్మి వేస్తోందని భర్త ఫిర్యాదు చేశాడు. ఇది విని పోలీసులు షాక్ అయ్యారు. అయితే తన భర్తకు ఇతర మహిళలతో వివాహేతర సంబంధం ఉందని అతడి భార్య ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ దంపతులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షాహ్గంజ్కు చెందిన వ్యక్తికి ఒక మహిళతో వివాహం జరిగింది. అయితే అత్తవారింటికి వచ్చిన నాటి నుంచి ఆమె గుట్కాకు బానిస అయ్యింది. గుట్టుగా గుట్కా నములుతున్నది. గుట్కా అలవాటును మానుకోవాలని అత్తింటి వారు చెప్పినప్పటికీ ఆమె లెక్కచేయలేదు.
కాగా, భార్య తీరుతో విసిగిపోయిన భర్త, అతడి కుటుంబ సభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. తన భార్య ప్రతి రోజు గుట్కా నమలడంతోపాటు ఇంట్లో ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తోందని అతడు వాపోయాడు. ఇది విని పోలీసులు నోరెళ్లబెట్టారు.
మరోవైపు భర్తపై ఆ మహిళ పలు ఫిర్యాదులు చేసింది. ఇతర మహిళలతో భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించింది. తనకు సంతానం కలుగకపోవడంతో భర్త, అత్త కుటుంబం కొట్టడంతోపాటు ఇంటి నుంచి వెళ్లమంటున్నారని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరింత కౌన్సిలింగ్ కోసం మరో రోజు రావాలని వారికి చెప్పారు.