న్యూఢిల్లీ: టాటా సంస్థ అధినేత రతన్ టాటా ఈ లోకాన్ని వీడారు. ఆయన్ను స్మరిస్తూ మరో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ(Gautam Adani) తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన వ్యాపార విస్తరణ, తత్వం అన్నింటికీ రతన్ టాటానే ప్రేరణ అని అదానీ పేర్కొన్నారు. టెట్లే, కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో రతన్ టాటా అంతర్జాతీయ మార్కెట్‌ను ఇండియాకు పరిచయం చేశారని, ఆయన చూపిన ఆ మార్గమే తనకు ఆదర్శంగా నిలిచినట్లు గౌతం అదానీ తెలిపారు. ఆ రూట్లోనే ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇజ్రాయిల్, ఆఫ్రికాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు అదానీ ఓ ఆంగ్ల పత్రికకు రాసిన నివాళి కథనంలో పేర్కొన్నారు.
రతన్ టాటా ఓ సంపూర్ణ త్యాగజీవి అని, తమ కాలం చూసిన అద్భుతమైన వ్యాపారవేత్త అని రాశారు. రతన్ టాటా గొప్ప పారిశ్రామికవేత్త అని పేర్కొనడం ఆయన్ను తక్కువగా చేయడమే అవుతుందని, ఆయన ఒక అసాధారణ వ్యక్తి అని, అసాధారణ సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తి అని, ఆయన టచ్ చేయని వ్యాపారం ఏదీ లేదంటూ అదానీ తన కథనంలో పేర్కొన్నారు. రతన్ టాటా తన జీవన విధానం, పనితీరుతో.. ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచారన్నారు.
భారత్, విదేశాల్లోనూ ఆయన్ను ప్రేరణగా తీసుకున్నారన్నారు. ఆయన ప్రభావం వల్ల ఎంతగానో లబ్ధి పొందిన వ్యక్తుల్లో తాను ఒకడిని అని అదానీ తెలిపారు. రతన్ వ్యాపార శైలి గురించి చెప్పాలంటే వేల పేజీలైనా సరిపోవు అని, కానీ మూడు అంశాల్లో మాత్రం ఆ దిగ్గజాన్ని ఫాలో అయినట్లు వెల్లడించారు. తన వ్యాపార నిర్ణయాలు, వ్యాపార తత్వానికి ఆ మూడే కీలకంగా నిలిచాయన్నారు.
తమ సంస్థ అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి ప్రధాన కారణంగా రతన్ టాటా అన్నారు. ఆయన ప్రభావం వల్లే తాము విదేశాల్లో బిజినెస్ మొదలుపెట్టనట్లు అదానీ చెప్పారు. టాటా సంస్థతో పాటు కార్పొరేట్ ఇండియాను ఆయన విశ్వవ్యాప్తం చేశారన్నారు. గ్లోబల్ స్టేజ్‌లో ఇండియా పోటీపడగలదన్న నమ్మకాన్ని ఆయన కలిగించారన్నారు. టెట్లే, కోరస్, జాగ్వార్ లాంటి కంపెనీలు తమకు ప్రేరణగా నిలిచినట్లు అదానీ చెప్పారు. ఆ ప్రేరణతోనే ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇజ్రాయిల్,ఆఫ్రికాల్లో తమ సంస్థ వ్యాపారాలు మొదలుపెట్టినట్లు అదానీ వెల్లడించారు.
నవీ ముంబైలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం డెవలప్మెంట్లో ఆయన పాత్ర కీలకమైందని అదానీ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టును చేపట్టాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో.. రతన్ టాటా తన మాటలతో ఎంతో ప్రోత్సాహాన్ని నింపినట్లు అదానీ తన నివాళి కథనంలో పేర్కొన్నారు. త్వరలోనే ఆ విమానాశ్రయం ఓపెన్ కానున్నదని, కానీ రతన్ టాటాను మిస్సవుతున్నట్లు తెలిపారు. లాభాలు పొందడమే సక్సెస్ కాదు అని, ఉద్దేశం చాలా ముఖ్యమైందన్న భావనతో రతన్ టాటా ఉండేవారని, జాతి నిర్మాణం కోసం ఆయన చాలా దీక్షతో పనిచేశారని, వ్యాపారం ద్వారా ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం ఆయనలో ఉండేదన్నారు. భారత దేశ ప్రగతిలో ప్రతి భారతీయుడు లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే తాము కూడా వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు చేస్తున్నట్లు అదానీ చెప్పారు.
రతన్ టాటా విజన్‌తోనే తాము అనేక సవాళ్లతో కూడిన ప్రాజెక్టులను చేపట్టినట్లు అదానీ పేర్కొన్నారు. ముంబైలోని ధారావీ ప్రాంతాన్ని ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. రతన్ టాటా ఓ పరిపూర్ణమైన వ్యక్తి అని, ఆయన మరణం తనకు తీరని లోటును కలిగించిందన్నారు. రతన్ టాటా మృతి వల్ల ఓ మార్గదర్శకుడిని, ద్రువతారను కోల్పోయినట్లు చెప్పారు. ఈ దేశం ఓ అద్భుత మానవతావాదికి దూరమైనట్లు వెల్లడించారు.