శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో (Reasi) హిందూ దేవాలయం కోసం ముస్లింలు భూమిని ఇచ్చారు. రియాసి జిల్లాలోని కాన్సి పట్టా గ్రామంలోని గౌరీ శంకర్ ఆలయం (Gouri Shankar Temple) కోసం సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో 1200 మీటర్ల రహదారిని 10 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్నారు. ఈ 500 ఏండ్ల నాటి హిందూ ఆలయానికి రోడ్డు నిర్మాణం కోసం ఖేర్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ అనే వ్యక్తులు తమ భూమిని విరాళంగా ఇచ్చారు. త్వరలో పంచాయతీ నిధులతో ఈ రోడ్డును నిర్మించనున్నామని అధికారులు తెలిపారు.
రోడ్డు సమస్యను సాకుగా చూపి సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నించారని మాజీ పంచాయతీ సభ్యుడు, రైతు గులాం రసూల్ అన్నారు. ఆలయానికి సరైన రహదారి లేదని, కొందరు వ్యక్తులు చీలికను సృష్టించాలనే ఉద్దేశ్యంతో విద్వేష ప్రచారాన్ని కూడా నడిపారని విమర్శించారు. కాగా, మతసామరస్యాన్ని కాపాడేందుకు ఇటీవల పంచాయతీ సభ్యులు, రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారని వెల్లడించారు. ఈ సమావేశంలో భూ యజమానులు గులాం రసూల్, గులాం మహ్మద్ తమ భూమిలో కొంత భాగాన్ని రోడ్డు కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.