Muslim Woman : పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆస్పత్రి (Govt hospital) కి వెళ్లిన తనకు వైద్యం చేసేందుకు డ్యూటీ డాక్టర్ (Duty doctor) నిరాకరించాడని, ముస్లిం మహిళలకు తాను డెలివరీ చేయనని వెళ్లగొట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్‌గా మారింది. దాంతో స్థానికంగా కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని జాన్పూర్ జిల్లా (Jaunpur district) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గత నెల 30న రాత్రి 9.30 గంటల సమయంలో షమా పర్వీన్ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు జాన్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి డ్యూటీ డాక్టర్ తనకు వైద్యం చేసేందుకు నిరాకరించాడని, ముస్లింలకు తాను డెలివరీ చేయనని చెప్పాడని, నన్ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకురావద్దని నర్సును ఆదేశించాడని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని మా కుటుంబసభ్యులను గద్దించాడని సదరు మహిళ ఆరోపించింది.
ఈ ఆరోపణలకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఇద్దరు జర్నలిస్టులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో స్థానికంగా కలకలం రేగింది. ఆపై ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ సర్కారులో ఇలాంటివే జరుగుతాయని, మతప్రాదిపదికన వైద్యం చేస్తారని ప్రతిపక్ష సమాజ్‌వాది, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేశాయి.
కాగా ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండ్‌ను వివరణ కోరగా.. తాను వైద్యుడిని విచారించానని, కానీ తాను అలా మాట్లాడలేదని అతను చెబుతున్నాడని చెప్పారు. అయితే జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చానని, వారు విచారించి చర్యలు తీసుకుంటారని అన్నారు. మరోవైపు మహిళ ఆరోపణలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన జర్నలిస్టులపై ఆస్పత్రి సూపరింటెండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.