న్యూఢిల్లీ, ఆగస్టు 29: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ విధానాలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషీ విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని అంటూ ముఖ్యంగా ఎంతో కీలకమైన విద్య విషయంలో ఒక విధానం లేకుండాపోయిందని విమర్శించారు. ‘ఈ ప్రభుత్వానికి విద్య ప్రాధాన్య అంశం కాదు. విద్యకు కేటాయించే బడ్జెట్ తగ్గుతున్నది. వికసిత్ అంటే ఏమిటి? పాఠశాలను స్థాపిస్తారు.. అక్కడ టీచర్లు ఉండరు. విద్యార్థులు ఏం కావాలి? కాలేజీలు నెలకొల్పామని చెప్పుకుంటారు.. కానీ ఉద్యోగాలేవి? వాజపేయి హయాంలో ప్రశ్నాపత్రాలు ఎందుకు లీక్ కాలేదు?’ అని అమర్ ఉజాలా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోషీ ప్రశ్నించారు.
ప్రభుత్వ విధానాలు, దేశంలో విద్యావ్యవస్థ, విద్యకు కేటాయిస్తున్న బడ్జెట్లో తగ్గింపు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో వేల సంఖ్యలో స్కూళ్లు మూత పడుతున్నాయని, విద్య ప్రైవేటీకరణ జోరు గా సాగుతున్నదని, పేపర్ లీకేజీలు నిత్యకృత్యమయ్యాయని, అవినీతికి హద్దే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ సమస్య పరీక్షా విధానాలలో లోపం కాదని, పాలనలో పెరుగుతున్న అవినీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘విద్య ఆర్థికంగా ఉత్పాదకతను కలిగించేదిగా ఉండాలి’ అని చెప్పారు.
విద్యావ్యవస్థలో అవినీతి కారణంగానే ఇటీవలి కాలంలో పేపర్ లీక్‌లు పెరిగిపోయాయని జోషీ చెప్పారు. వ్యవస్థనే అనైతిక పద్ధతులకు ఆస్కారం కల్పిస్తున్నప్పుడు విద్యార్థుల నుంచి నిజాయితీని ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. ‘ప్రజలు తమ చుట్టూ జరుగుతున్న వాటిని గమనిస్తుంటారు. ఓ వ్యక్తి లంచం ఇచ్చి కాంట్రాక్టును పొందినప్పుడు, తమ దరఖాస్తులు ఆమోదం పొందడానికి తాము కూడా అటువంటి ప్రయత్నాలే చేయాలని భావిస్తారు. ఉన్నతస్థానంలోని వ్యక్తులు, మంత్రులే కాదు, న్యాయవ్యవస్థలోని వారిపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నప్పుడు.. సామాన్యులు కూడా అదే సరైన మార్గం అన్న నిర్ధారణకు వస్తారు. ఈ మార్గాన్ని మీరే స్వయంగా ఏర్పరచి, ఇప్పుడు దానిపై ప్రశ్నిస్తే ఎలా?’ అని నిలదీశారు.
‘వాజపేయి హయాంలో ప్రశ్నపత్రాలు ఎందుకు లీక్ కాలేదు?’ అని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ సమయంలో తాము ప్రాథమిక సూత్రాలపైనే ప్రధానంగా దృష్టిసారించామని తెలిపారు. ‘ఇప్పుడు బ్యాంకుల్లో కుంభకోణాలు జరుగుతున్నాయి..కాబట్టి విద్యారంగంలో కూడా అనివార్యంగా మోసాలు జరుగుతాయి. వ్యాపారాల్లో స్కామ్‌లు జరుగుతున్నాయి. పాపం! విద్యార్థులనెందుకు బద్నాం చేస్తున్నారు? సమాజంలో జరుగుతున్నదానినే కదా వారు అనుసరిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా కేంద్ర సర్కార్ తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను జోషీ ఎద్దేవా చేశారు. ‘ఇది నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఈ సన్నాహాలు పరీక్షల కోసమే లేక యుద్ధం కోసమా?’ అని వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్‌కు విద్య ప్రాధాన్య అంశం కాదని, అందువల్లనే విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. విద్య, ప్రాథమిక విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు తగ్గుతుండగా, రోడ్లు, రోడ్డు రవాణాకు కేటాయింపులు పెరుగుతున్నాయి’ అని వివరించారు. విద్యలో సమానత్వం కోసం ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ ఉండాలని జోషి సూచించారు. ప్రతి విద్యార్థి తనకు దగ్గరలోని స్కూల్లో చదువుకొనేలా అవసరమైతే రాజ్యాంగాన్ని సైతం సవరించాలని మురళీ మనోహర్ జోషి పేర్కొన్నారు.