మైసూరు : కర్ణాటకలోని మైసూరులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెరియపట్నకు చెందిన సిద్ధరాజు తన గర్ల్‌ఫ్రెండ్ రక్షితను సాలిగ్రామ తాలూకా, కప్పడిలో ఉన్న లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నోట్లో జిలెటిన్ స్టిక్‌ను పెట్టి, పేల్చేశాడు. ఆమె మరణించిన తర్వాత, అతను మొబైల్ ఫోన్ పేలిందని లాడ్జి సిబ్బందిని తప్పుదోవ పట్టించాడు. అక్కడ ఫోన్ కనిపించకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. పదే పదే ప్రశ్నించగా, ఫోన్‌ను కిటికీ నుంచి బయటకు విసిరేశానని సిద్ధరాజు చెప్పాడు.
అతని మాటలను నమ్మని సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రశ్నించడంతో సిద్దరాజు అసలు విషయాన్ని బయటపెట్టాడు. రక్షితకు కేరళలోని ఓ వ్యక్తితో వివాహం జరిగినట్లు తెలుస్తున్నది. కానీ ఆమె, సిద్ధరాజు మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. సాలిగ్రామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.