న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. (Delhi Triple Murder) కుమారుడే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. అతడ్ని అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం దక్షిణ ఢిల్లీ నెబ్ సరాయ్ ప్రాంతంలోని ఇంట్లో 51 ఏళ్ల రాజేష్ కుమార్, 46 ఏళ్ల భార్య కోమల్, 23 ఏళ్ల కుమార్తె కవిత కత్తిపోట్లతో మరణించారు. తాను మార్నింగ్ వాక్కు వెళ్లానని ఇంటికి తిరిగి రాగా తన తల్లిదండ్రులు, సోదరి కత్తిపోట్లతో చనిపోయారని వారి కుమారుడైన 20 ఏళ్ల అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, ట్రిపుల్ మర్డర్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అర్జున్ మార్నింగ్ వాక్కు వెళ్లలేదని, ఇంటి నుంచి బయటకు వచ్చి పొరుగువారిని పిలిచినట్లు తెలుసుకున్నారు. దీంతో అతడిపై అనుమానం వ్యక్తం చేసి అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అర్జున్ను పోలీసులు ప్రశ్నించగా తల్లిదండ్రులు, సోదరిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తండ్రి తనను ఎప్పుడూ అవమానించడంతో పగపెంచుకున్నట్లు తెలిపాడు. అలాగే తల్లిదండ్రులు తన అక్క పట్ల ఎక్కువ ప్రేమ చూపడంతోపాటు ఆస్తిని ఆమెకు ఇచ్చేందుకు వీలునామా రాయడం కూడా వారిపై ద్వేషం పెంచిందని చెప్పాడు.
Delhi Murder
కాగా, బుధవారం తల్లిదండ్రుల పెళ్లి రోజు కావడంతో వారి హత్యకు ప్లాన్ చేసినట్లు అర్జున్ తెలిపాడు. తెల్లవారుజామున తొలుత నిద్రిస్తున్న సోదరిని, తండ్రిని, ఆ తర్వాత తల్లిని ఆర్మీ కత్తితో వారి గొంతులపై పొడిచి హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో అర్జున్ను అరెస్ట్ చేసి ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.