న్యూఢిల్లీ: చాలా ఆస్తులున్న వృద్ధురాలి (old woman murder) నుంచి వాటిని కాజేసేందుకు ఒక రియల్టర్, ఇద్దరు పాల వ్యాపారులు కుట్ర పన్నారు. అద్దె వసూలు చేసుకుని స్కూటర్‌పై వెళ్తున్న ఆమెపై వారు దాడి చేశారు. ఆధారాలు లేకుండా చేసేందుకు ఐఎస్ కత్తులతో పొడిచి చంపారు. చివరకు పోలీసుల దర్యాప్తులో వారు పట్టుబడ్డారు. నిందితులంతా 20 ఏళ్ల లోపు యువకులే. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. 72 ఏళ్ల సుధా గుప్తా అనే మహిళకు చాలా ఆస్తులున్నాయి. 12 ఏళ్ల కిందట ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమారులు డాక్టర్లు, మరో కుమారుడు ప్రొపర్టీ డీలర్. కుమార్తెలకు కూడా పెళ్లిలయ్యాయి. ఆ కుటుంబానికి ఉన్న పలు ఆస్తుల వ్యవహారాలను ఆ వృద్ధురాలే చూస్తున్నది.
కాగా, సుధా గుప్తాకు ఉన్న కొన్ని ఆస్తులపై రియల్ ఎస్టేట్ డీలర్, ఇద్దరు పాల వ్యాపారుల కన్ను పడింది. యువకులైన ఆ ముగ్గురు సుమారు రూ.40 కోట్ల విలువైన ఆమె ఆస్తిని కాజేసేందుకు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆ వృద్ధురాలిని ఎలా చంపాలి, ఎలా ఆస్తిని దక్కించుకోవాలని అన్న దానిపై మరో వ్యక్తితో కలిసి చర్చించారు. వృద్ధురాలి హత్య కోసం యూట్యూబ్‌లో కూడా సెర్చ్ చేశారు. చివరకు ఆయుధాలతో పట్టుబడకుండా ఉండేందుకు ఐఎస్ కత్తులతో చంపాలని ప్లాన్ వేశారు.
మంగళవారం మధ్యాహ్నం మండవాలిలోని ఒక ఆస్తికి సంబంధించిన అద్దెను సుధా గుప్తా వసూలు చేసింది. ఆ తర్వాత లక్ష్మీ నగర్‌లోని ఇంటికి స్కూటర్‌పై వెళ్తున్నది. మాటు వేసిన నిందితులు మార్గమధ్యలో ఆ వృద్ధురాలిపై దాడి చేశారు. ఐస్ కత్తులతో ఆమె శరీరంపై 52 చోట్ల పొడిచి పారిపోయారు. రోడ్డుపై ఉన్న వారు ఇది చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొందరు ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు వృద్ధురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె శరీరంపై 52 కత్తిపోటు గాయాలు ఉండటాన్ని డాక్టర్లు పరిశీలించారు. ఆమెను హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను గుర్తించారు. 18 ఏళ్ల మోను దేధా అలియాస్ చాచా, 18 ఏళ్ల పుష్పేంద్ర యాదవ్ అలియాస్ అయ్య, 19 ఏళ్ల సార్థక్ నగర్ అలియాస్ లాడూ, 20 ఏళ్ల వికాస్ చౌదరి అలియాస్ లల్లాను అరెస్ట్ చేశారు.
కాగా, నిందితులైన దేధా ప్రోపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నాడని, లాడూ, లల్లా పాల వ్యాపారులని పోలీసులు తెలిపారు. స్కూల్ చదువును మధ్యలో మానేసిన నలుగురు యువకులు కొంత కాలంగా ఆ వృద్ధురాలి ఆస్తిపై కన్నేసి ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసినట్లు చెప్పారు. దేధా, యాదవ్, సార్థక్ మూడు ఐస్ పిక్‌లతో ఆమెపై దాడి చేసి పొడిచారని, చనిపోయినట్లు నిర్ధారించుకుని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వికాస్ చౌదరి ఈ ముగ్గురిని కలిసి గురుగ్రామ్‌లో వారిని డ్రాప్ చేసినట్లు చెప్పారు. అక్కడి నుంచి వారు క్యాబ్‌లో హర్యానాకు పారిపోయారని తెలిపారు. రిథోజ్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంట్లో బస చేసిన ఆ నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.