ముంబై: ఒక మహిళ ఫోన్లో మాట్లాడుతూ కారును వేగంగా డ్రైవ్ చేసింది. రోడ్డు దాటుతున్న బాలుడ్ని ఢీకొట్టింది. ఆ బాలుడు మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి అరెస్ట్ చేశారు. (Bandra Hit And Run Case) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం బాంద్రాలోని జిజామాత గార్డెన్ ప్రాంతంలో ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. పిల్లలతో ఆడుకుని ఇంటికి తిరిగి వెళ్తూ రోడ్డు దాటుతున్న 8 ఏళ్ల అన్ష్ రవీంద్ర గుప్తాను ఆ కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్న ఒక మహిళ కారును వేగంగా డ్రైవ్ చేసి బాలుడ్ని ఢీకొట్టినట్లు స్థానికులు ఆరోపించారు. దీంతో కారు నంబర్ ఆధారంగా 45 ఏళ్ల మేఘా రావల్‌ను నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఆమెను అరెస్ట్ చేశారు. సోమవారం కోర్టులో హాజరుపరచగా తదుపరి విచారణ నిమిత్తం ఒక రోజు పోలీస్ కస్టడీకి ఆమెను అప్పగించారు.
మరోవైపు మేఘా రావల్, ముంబైకి చెందిన ఒక సర్టిఫైడ్ హెల్త్ కోచ్, ఫిట్నెస్ న్యూట్రిషనిస్ట్. 2021లో హెల్త్ ఫుడ్ బ్రాండ్ అయిన ‘మెజ్మో క్యాండీ’ సంస్థను ఆమె స్థాపించింది. పోషణ, స్వచ్ఛమైన ఆహారం, ఆరోగ్యంపై దృష్టి సారించే వృత్తిలో ఉన్న మేఘా రావల్, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రోత్సహించే పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తున్నది.