Watermelon Deaths : ఇటీవల మహారాష్ట్ర రాజధాని ముంబైలో బిర్యానీ, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మృతదేహాల పోస్టుమార్టం అనంతరం ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదిక వెల్లడైంది. ఈ నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత ఏప్రిల్ 25న ముంబైలోని జేజే మార్గ్ ఏరియాలో ఉండే అబ్దుల్లా డొకాడియా కుటుంబం ఓ పార్టీ నిర్వహించింది.
ఈ పార్టీకి వచ్చిన అతిథులంతా వెళ్లిపోయాక అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అబ్దుల్లా (40), ఆయన భార్య నస్రీన్ (35), వారి కూతుళ్లు అయేషా (16), జైనెబ్ (13) బిర్యానీ తిని, అనంతరం వాటర్ మిలన్ తిన్నారు. తర్వాత కొన్ని గంటల్లోపే వారికి తీవ్ర విరేచనాలు, వాంతులు ప్రారంభమయ్యాయి. దీంతో వెంటనే జేజే ఆస్పత్రికి వెళ్లినప్పటికీ, వారు చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఇలా బిర్యానీ తిని, ఆ తర్వాత వాటర్ మిలన్ తినడంతోనే ఈ మరణాలు సంభవించాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక విడుదలైంది.
ప్రాథమిక అంచనా ప్రకారం ఈ నలుగురిపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎందుకంటే నలుగురి మృతదేహాల్లోని అంతర్గత అవయవాలు రంగు మారిపోయియా. మెదడు, గుండె, ఇతర జీర్ణావయవాలు అన్నీ ఆకు పచ్చ రంగులోకి మారిపోయాయి. సాధారణంగా జరిగే ఫుడ్ పాయిజనింగ్ మరణాల్లో ఇలా జరగదని నిపుణులు అంటున్నారు. అంటే, ఇది సాధారణ ఫుడ్ పాయిజన్ కాకుండా ఏదైనా విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అబ్దుల్లా శరీరంలో మార్ఫైన్ అనే ప్రమాదకర రసాయనాన్ని గుర్తించారు. శరీరంలో అనేక అవయవాలు రంగు మారాయంటే ఏదో విష పదార్థం శరీరం అంతా వ్యాపించి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు.
దీంతో వీరి మరణంపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అనేక కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు, వైద్య, ఫోరెన్సిక్ నిపుణులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నారు. బాధితులు ఆహారం తీసుకున్నప్పటి ఫుడ్ శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. అయితే, వారు తిన్న వాటర్ మిలన్ ఎక్కడ తీసుకొచ్చారు అనే విషయంలోనే స్పష్టత రావడం లేదు. ఈ వాటర్ మిలాన్ ఎక్కడ కొన్నారో కనుక్కోవడం అధికారులకు కష్టంగా మారింది. ఈ విషయంలో క్లారిటీ వస్తే కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల బంధువుల్ని విచారిస్తున్నారు.
అలాగే, కుటుంబం అంతా కలిసి ఆత్మహత్యకు యత్నించారా లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉండి ఎవరైనా ఇలా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇదంతా ఒకవైపు ఉంటే మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. 2019లో డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక ఫ్రాడ్ కేసులో అబ్దుల్లా కీలక సాక్షిగా ఉన్నారు. ఈ కేసు విచారణ ఈ ఏడాది జరగాల్సి ఉంది. ఒక మహిళను రియల్ ఎస్టేట్ డెవలపర్ మోసం చేసిన కేసు ఇది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు, అబ్దుల్లా, అతడి కుటుంబం మరణానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.