ముంబై, జూన్ 13: ఆన్లైన్లో కోన్ ఐస్క్రీమ్ ఆర్డర్ చేసిన ఓ వైద్యుడికి భయానక అనుభవం ఎదురైంది. ముంబైలో మలద్ ప్రాంతానికి చెందిన బ్రెండన్ ఫిర్రావ్(26) బుధవారం మధ్యాహ్నం ఆన్లైన్లో యమ్మో కంపెనీకి చెందిన కోన్ ఐస్క్రీమ్ ఆర్డర్ చేశాడు. దీనిని తెరిచి తింటుండగా గట్టిగా ఉన్న ఒక పదార్థం నోట్లోకి వచ్చింది.
మొదట ఇది ఐస్క్రీమ్లో ఉండే డ్రైఫ్రూట్స్కు చెందిన ఏదైనా పలుకు అని భావించాడు. కానీ, అనుమానించి బయటకు ఊసి చూడగా గోరుతో ఉన్న చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఇది చూడగానే ఫిర్రావ్ భయాందోళనకు గురయ్యాడు. వైద్యుడైన అతడు ఈ మాంసపు ముక్క మనిషి బొటనవేలిగా గుర్తించి షాక్ తిన్నాడు. ఈ విషయమై కంపెనీకి ఇన్స్టాగ్రామ్లో ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో ఈ మాంసపు ముక్కను ఒక ఐస్ బ్యాగ్లో వేసుకొని మలద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.