ముంబై: బహిరంగ ప్రదేశంలో పావురాలకు తిండి గింజలు చల్లిన(Pigeon Feeding) ఓ ముంబై వ్యాపారవేత్తకు స్థానిక కోర్టు 5 వేల జరిమానా విధించింది. ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందడానికి అతను కారణం అవుతున్నట్లు కోర్టు పేర్కొన్నది. ముంబై నగరంలో అనేక ప్రాంతాల్లో పావురాలకు గింజలు చల్లడంపై మున్సిపాల్టీ నిషేధం విధించింది. పావురాలకు గింజలు వేయడం ఓ న్యూసెన్స్‌గా మారిందని, ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోందని మున్సిపాల్టీ ఆ నిర్ణయం తీసుకున్నది. అయితే మూసివేసిన ఖబూతర్ఖాన్ వద్ద దాదార్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి నితిన్ సేత్ ఆగస్టు ఒకటో తేదీన పావురాలకు తిండి గింజలు వేశాడు. డిసెంబర్ 22వ తేదీన ఆ కేసులో తీర్పు ఇచ్చారు.
అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వీయూ మిసాల్ అతన్ని దోషిగా తేల్చారు. అయితే క్షమాపణ కోరడంతో అతనికి కోర్టు 5 వేల జరిమానా విధించింది. బహిరంగంగా పక్షకులకు ఫీడింగ్ చేయడం వల్ల మనుషులకు ప్రమాదకరంగా మారినట్లు కోర్టు చెప్పింది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 ఉల్లంగించినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. వ్యాధులు వ్యాపించే రీతిలో ప్రవర్తించినందుకు అతనిపై బీఎన్ఎస్లోని సెక్షన్ 271 కింద కూడా కేసు బుక్ చేశారు.