న్యూఢిల్లీ : మల్టీప్లెక్సులలో సినిమా టికెట్లు, ఆహార పదార్థాలు, కూల్ డ్రింకుల ధరలు విపరీతంగా ఉండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సినిమా థియేటర్లకు ప్రేక్షకుల రాక కొనసాగాలంటే ధరలను అందుబాటులో ఉంచాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. మల్టీప్లెక్సులలో సినిమా టికెట్ల ధరలు గరిష్ఠంగా రూ.200కు పరిమితం చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చిన కర్ణాటక హైకోర్టు విధించిన కొన్ని షరతులను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. మల్టీప్లెక్సులలో విక్రయించే వస్తువుల ధరలు విపరీతంగా ఉండడాన్ని జస్టిస్ విక్రమ్ నాథ్ ప్రస్తావిస్తూ వాటర్ బాటిల్‌కు రూ. 100, కాఫీకి రూ. 700 మీరు వసూలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.
దీనిపై మల్లీప్లెక్సు అసోసియేషన్ తరఫున ముకుల్ రోహత్గీ స్పందిస్తూ, ‘తాజ్‌లో కాఫీకి రూ. 1000 వసూలు చేస్తారు. అక్కడ ధరలను మీరు నియంత్రించగలరా? ఇది కేవలం ప్రజల ఇష్టాఇష్టాలపైనే ఆధారపడి ఉంటుంది’ అని అన్నారు. దీనికి జస్టిస్ నాథ్ జవాబిస్తూ, ‘రేట్లను కట్టడి చేయాల్సిందే. ప్రజలు థియేటర్లకు వచ్చి వినోదం పొందేలా ధరలు అందుబాటులో ఉంచాలి. లేకపోతే థియేటర్లు ఖాళీ అవుతాయి’ అని చెప్పారు. రోహత్గీ తన వాదన కొనసాగిస్తూ, ‘ఖాళీగా ఉంటే ఉండనివ్వండి. ఈ ఆదేశాలు కేవలం మల్టీప్లెక్సులకే పరిమితం. ప్రజలు సాధారణ సినిమా థియేటర్లకు కూడా వెళ్లవచ్చు. మల్టీప్లెక్సులకే ఎందుకు రావాలి?’ అని ప్రశ్నించారు.