న్యూఢిల్లీ, డిసెంబర్ 20 : రానున్న 2025 సీజన్లో ఎండుకొబ్బరికి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని క్వింటాలుకు రూ.422 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎంఎస్పీ క్వింటాలు రూ.12,100 చేరుకుంది. ఇందుకోసం రూ. 855 కోట్ల బడ్జెట్ కేటాయింపులు కేంద్రం చేసింది. ప్రధాని అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మిల్లింగ్ ఎండుకొబ్బరికి ఎంఎస్పీని క్వింటాలుకు రూ. 422, బంతి కొబ్బరికి ఎంఎస్పీని క్వింటాలుకు రూ. 100 పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశంలో ఎండుకొబ్బరి మొత్తం ఉత్పత్తిలో 32.7 శాతం కర్ణాటకలో జరుగుతుండగా, తమిళనాడులో 25.7 శాతం, కేరళలో 25.4 శాతం, ఆంధ్రప్రదేశ్లో 7.7 శాతం జరుగుతోంది.