న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: చట్టసభలు ఆమోదించిన తర్వాత గవర్నర్ పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో న్యాయవ్యవస్థపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విమర్శలు చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఒక రాజ్యసభ చైర్మన్ ఇలా రాజకీయ ప్రకటనలు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతికి వ్యక్తిగత అధికారాలు ఉండవని, ఆ పదవిలో ఉన్న వారు నామమాత్రపు అధిపతి మాత్రమేనని, వారు మంత్రి మండలి సహాయం, సలహాలపై మాత్రమే పనిచేస్తారని స్పష్టం చేశారు. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు అధికార, విపక్ష పార్టీలకు సమాన దూరాన్ని పాటించాలే తప్ప ఒక పార్టీ ప్రతినిధిగా వ్యవహరించ కూడదని అన్నారు. ‘స్పీకర్, చైర్మన్ స్థానం లో ఉన్నప్పుడు వారు పార్టీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ మాట్లాడరాదు. అలా మాట్లాడితే ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని దిగజార్చినట్టు అవుతుంది’ అని అన్నారు.