న్యూఢిల్లీ, ఆగస్టు 2: భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ శనివారం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నిరుడు జరిగిన లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిన మాట ముమ్మాటికీ నిజమని, అధికార పార్టీకి ఎన్నికల సంఘం అనుకూలంగా వ్యవహరించడం నూటికి నూరుపాళ్లు వాస్తవమని నొక్కి చెప్పారు. దానిని త్వరలోనే రుజువు చేస్తామని, తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.
దేశంలో పోలింగ్ వ్యవస్థ మరణించిందని, 2024 లోక్సభ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయని ఆయన ఆరోపించారు. దేశంలో మొత్తం 70 నుంచి 100 సీట్లలో మోసం జరిగినట్టు తమ పార్టీ అనుమానిస్తున్నదని అన్నారు.
ఈ వాదనను రుజువు చేయడానికి తన వద్ద 100 శాతం రుజువులు ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు.కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం 6.5 లక్షల ఓట్లలో 1.5 లక్షలు నకిలీవని నిర్ధారణ అయ్యిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్నికలు ఎలా రిగ్గింగ్ అయ్యాయో ఎలాంటి సందేహం లేకుండా రుజువు చేయబోతున్నాం అని రాహుల్ స్పష్టం చేశారు.