భోపాల్: ఒక మహిళ బయటకు వెళ్లేందుకు అందంగా ముస్తాబైంది. డ్రెస్‌పై పెర్ఫ్యూమ్ చల్లుకున్నది. ఇది గమనించిన భర్త ఆమెను నిలదీశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన భర్త, గన్‌తో భార్యపై కాల్పులు జరిపాడు (man shoots wife). అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బిజోలి ఠాణా పరిధిలోని గణేష్‌పుర ప్రాంతానికి చెందిన నీలం, మహేంద్ర జాతవ్‌కు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. మహేంద్ర ఒక చోరీ కేసులో నాలుగేళ్లపాటు జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నీలం తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. శిక్ష పూర్తికావడంతో మహేంద్ర ఏడాది కిందట జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్ద ఉంటున్న నీలంతో కలిసి జీవిస్తున్నాడు.
కాగా, శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నీలం అందంగా ముస్తాబైంది. అంతేగాక ధరించిన దుస్తులపై పెర్ఫ్యూమ్ కూడా చల్లుకున్నది. ఇది గమనించిన భర్త మహేంద్ర, భార్య నీలంను దీని గురించి ప్రశ్నించాడు. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన మహేంద్ర గన్ తీసి భార్య నీలం ఛాతిపై కాల్పులు జరిపాడు. ఆమె కింద పడిపోగా అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు నీలం పరిస్థితిని గమనించిన సోదరుడు తన బంధువులను పిలిచాడు. వారి సహాయంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, నీలం కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కింద మహేంద్రపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం వెతుకుతున్నారు.