ముంబై: తీవ్ర నేరాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పేరు గడించిన డాన్ ‘బాబా ఫర్జాన్’ విలాసవంతమైన బంగళాపై పోలీసులు రైడ్ చేశారు. పలు గదుల్లో కుప్పలుతెప్పలుగా పడి ఉన్న నోట్ల కట్టలతో పాటు పలు ఆయుధాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. (Don Baba Farzan) మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. 1990వ దశకంలో అల్లర్లు, దాడులు, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి నేరాలతో ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన డాన్ బాబా ఫర్జాన్ అనారోగ్యంతో ఆరు నెలల కిందట మరణించాడు.
కాగా, డాన్ బాబా ఫర్జాన్ నేరాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు శనివారం ఉదయం ఆయనకు చెందిన ఒక విలాసవంతమైన బంగ్లాపై రైడ్ చేశారు. ఆ సమయంలో ఫర్జాన్ రెండో భార్య అయిన 52 ఏళ్ల షీలా గణపత్రావు సాల్వే ఆ ఇంట్లో ఉన్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సోదాల్లో పలు గదుల్లోని పెట్టెల్లో రూ. 100, రూ. 200, రూ. 50, రూ. 20, రూ.10 నోట్ల కట్టలు పెద్ద మొత్తంలో బయటపడ్డాయి. ఐదు కరెన్సీ లెక్కింపు యంత్రాలతో ఆ నగదును లెక్కించారు. లెక్కల్లో చూపని రూ. 5,26,29,560 డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు రూ. 5,50,000 విలువైన పలు ఆయుధాలు కూడా ఆ ఇంట్లో లభించాయి. మ్యాగజైన్లతో కూడిన రెండు పిస్టల్స్, నాలుగు రైఫిల్స్, 12-బోర్ రైఫిల్స్, రెండు ఎయిర్ గన్స్, ఒక .22 ఎంఎం రైఫిల్, ఒక కత్తి, మూడు చిన్న కత్తులు, 17 రకాల ఇతర కత్తులు, 21 పదునైన ఆయుధాలు ఉన్నాయి. 12-బోర్, 0.22 ఎంఎం రైఫిల్స్, ఒక పిస్టల్, ఒక రివాల్వర్ లైసెన్స్‌లు బాబా ఫర్జాన్ పేరు మీద నమోదైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న రెండవ పిస్టల్‌కు సంబంధించి ఎలాంటి లైసెన్స్ లేదా పత్రాలు పోలీసులకు లభించలేదు.
అయితే రూ.5.26 కోట్ల డబ్బు, పలు ఆయుధాలతో పాటు రూ.21,34,350 విలువైన బంగారు ఆభరణాలు, రూ. 8,09,248 విలువైన వెండి ఆభరణాలు, రూ. 34,836 విలువైన విదేశీ కంపెనీలకు చెందిన 45 మద్యం సీసాలు కూడా ఆ ఇంట్లో లభించాయి. వీటితోపాటు ఆర్థిక పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఫర్జాన్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. బయటపడిన ఈ భారీ డబ్బు, ఆయుధాలు, బినామీ ఆస్తుల పత్రాలు చాలా ఏళ్లుగా పరిష్కారం కాని పలు నేర కేసులకు సంబంధించినవిగా పోలీస్ అధికారులు భావిస్తున్నారు.