ముంబై, అక్టోబర్ 21: దోమల్లేని దేశంగా పేరుపొంది ఇప్పటివరకు సురక్షితంగా ఉన్న ఐస్లాండ్లోకి మొట్టమొదటిసారి దోమలు చొరబడ్డాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇప్పటివరకు ప్రాణం పోసుకోని కొత్తజీవులు ఐస్లాండ్లో పుట్టుకువస్తున్నాయి. ఈనెల వరకు ప్రపంచంలో దోమలు లేని అరుదైన ప్రదేశాలలో ఐస్లాండ్ ఒకటి. మరొకటి అంటార్కిటికా. దోమలు వృద్ధి చెందడానికి అవకాశం ఉన్న చిత్తడి నేలలు, కుంటలు అధికంగా ఉన్న ఐస్లాండ్లో దోమల రాక అనివార్యని శాస్త్రవేత్తలు కొంతకాలంగా అంచనా వేస్తున్నారు.
అయితే అత్యంత శీతల ప్రదేశమైన ఐస్లాండ్లో చాలా జీవరాశులు బతకడం అసాధ్యం. ఉత్తర గోళార్ధములోని ఇతర ప్రదేశాల కన్నా నాలుగు రెట్లు అధికంగా ఐస్లాండ్లో వాతావరణం వేడెక్కుతోంది. హిమనదాలు కూలిపోయి నదీజలాలు వెచ్చగా మారుతుండడంతో చేపలు సైతం వృద్ధి చెందుతున్నాయి. భూగోళ ఉష్ణోగ్రత పెరుగుదలతో దోమలకు చెందిన కొత్త రకాలు వివిధ దేశాలలో వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది లండన్‌లో ఈజిప్షియన్ దోమ గుడ్లు కనిపించగా కెంట్‌లో ఏషియన్ టైగర్ దోమ కనిపించింది. కాగా, తన ఇంట్లో కనిపించిన మూడు దోమలను ఓ శాస్త్రవేత్త తనకు పంపించినట్లు ఐస్లాండ్కు చెందిన నేచురల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఎంటోమాలజిస్టు మాథ్యూస్ ఆల్ఫ్రెడ్సన్ వెల్లడించారు. రెడ్ వైన్ రిబ్బన్ వద్ద ఈ నెల 16న కొన్ని వింత కీటకాలను తాను చూశానని స్థానిక శాస్త్రవేత్త బైజార్న్ హిజాల్ట్సన్ ఫేస్బుక్లో తెలిపారు.