న్యూఢిల్లీ : వాయు కాలుష్యం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బీఎస్-3, బీఎస్-4 వాహనాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఇప్పటి వరకు 5,800 వాహనాల యజమానులకు అధికారులు చలాన్లు జారీ చేశారు. ఆయా వాహనాల కదలికలపై ఈ నెల 13 వరకు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం వరకు ఆంక్షలు ఉల్లంఘించిన 5,882 వాహనదారులకు చనాన్లు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ఫేజ్-3 కింద ఢిల్లీలో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ ఫోర్ వీలర్ వాహనాలపై నిషేధం విధించినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు రూ.20వేల వరకు జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. ఆదివారం ఆంక్షలు అమలులో ఉండనుండగా.. వాయు నాణ్యత తగ్గని క్రమంలో మళ్లీ పొడిగించే అవకాశాలున్నాయని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.