న్యూఢిల్లీ: మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వేద్ ప్రకాశ్ మాలిక్ దేశంలో కరోనా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలపాటు జరిగిన కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్ల కంటే దేశంలో రోజువారీ కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ‘మన దేశం యుద్ధంలో ఉంది. శనివారం 1338 భారతీయులు కరోనా మహమ్మారి కారణంగా మరణించారు (ముందు రోజు 1182), కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ యుద్ధంపై దేశం దృష్టి సారించిందా? ఎన్నికల ర్యాలీలు, మత కార్యక్రమాలు, రైతు ఆందోళనలు, వనరులపై పోరాటం జరుగుతున్నాయి… భారతదేశాన్ని మేల్కొలపండి! అని ట్వీట్ చేశారు.
Our nation is at war.1338 Indians died due to pandemic yesterday(1182 day before): more than 2.5 times TOTAL killed in action in Kargil war. Is the nation focused on this war? Election rallies, Faith events, Farmer agitation, in-fighting over resources going on…Wake up India!
— Ved Malik (@Vedmalik1) April 18, 2021
పాకిస్థాన్‌తో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు జనరల్ వేద్ మాలిక్ భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి వల్ల దేశంలో యుద్ధం వంటి పరిస్థితి ఉంటే మరోవైపు ఎన్నికల ర్యాలీలు, రైతుల నిరసనలు, మత కార్యక్రమాలు నిర్వహిస్తుండటంపై మండిపడ్డారు.
దేశ్యాప్తంగా ఆదివారం 2.61 లక్షల కరోనా కేసులు, 1,501 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.47 కోట్లకు, మరణాల సంఖ్య 1,77,150కు పెరిగింది.