లక్నో: ఒక జిల్లా కలెక్టర్ కళ్లజోడును కోతి ఎత్తుకుపోయింది. ఆయన ఎంత మొరపెట్టుకున్నా దానిని తిరిగి ఇవ్వలేదు. చివరకు ఫ్రూటీ ఇవ్వడంతో ఆ కళ్లజోడును పక్కన పడేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బృందావనంలోని బాంకే బిహారీ మందిర్‌కు వెళ్లే వీధిలో అధికారులు, ఇతర సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ నవనీత్ చాహల్ నడిచి వెళ్తున్నారు. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న ఆయన భుజంపై ఒక కోతి కూర్చొంది. ఆ వెంటనే కలెక్టర్ నవనీత్ కళ్లద్దాలను ఎత్తుకెళ్లింది. అక్కడున్న ఇంటి ఇనుప మెట్లపై అది కూర్చొంది.
కాగా, కలెక్టర్‌తోపాటు ఇతర సిబ్బంది, పోలీసులు కోతి నుంచి కళ్ల జోడును తిరిగి పొందేందుకు తెగ ప్రయత్నించారు. నవనీత్ చాహల్ ఎంత మొర పెట్టుకున్నా ఆయన కళ్లద్దాలను ఆ కోతి తిరిగి ఇవ్వలేదు. చివరకు పోలీసులు రెండు ఫ్రూటీలను కోతి వద్దకు విసిరారు. దీంతో అది కళ్లజోడును పక్కన పడేసి ఫ్రూటీ ప్యాకెట్ తీసుకుంది. పోలీసులు ఆ కళ్లజోడును తెచ్చి కలెక్టర్‌కు ఇచ్చారు.
మరోవైపు అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యూపీలో ప్రధాన ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘బీజేపీ పాలనలోని దుష్ప్రవర్తనను అధికారులు చూడటం లేదు. దీంతో వారికి కళ్లజోడు అవసరం లేదని భావించిన కోతి దానిని తీసుకుంది’ అని హిందీలో ఎద్దేవా చేశారు.
बंदर ने सोचा जब भाजपा के शासन में प्रशासन को चश्मा लगाकर भी कुछ नहीं दिखता है तो चश्मे का क्या काम… pic.twitter.com/LlGaC1eD00
— Akhilesh Yadav (@yadavakhilesh) August 21, 2022